Relief for B.Pharmacy Students: ప్రైవేటు కాలేజీల్లో బీఫార్మసీ విద్యార్థులకు ఊరట
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:57 AM
ప్రైవేటు ఫార్మసీ కళాశాలల్లో బీఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఎట్టకేలకు ఊరట లభించింది. నవంబరులో బంద్ కారణంగా రెగ్యులర్ పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థుల..
ఈ నెల 27నుంచి మళ్లీ పరీక్షలు
హైదరాబాద్ సిటీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ఫార్మసీ కళాశాలల్లో బీఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఎట్టకేలకు ఊరట లభించింది. నవంబరులో బంద్ కారణంగా రెగ్యులర్ పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థుల కోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిల కోసం నవంబర్‌లో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే, జేఎన్‌టీయూహెచ్ పరీక్షలను వాయిదా వేయకపోవడంతో.. సుమారు 80కి పైగా కళాశాలల్లో చదువుతున్న వేలాదిమంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. తమ ప్రమేయం లేకుండా రెగ్యులర్ పరీక్షలకు గైర్హాజరు అయినట్లు జేఎన్‌టీయూ ప్రకటించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో దిగివచ్చిన జేఎన్‌టీయూ.. 27, 29తేదీల్లో మొదటి సంవత్సరం సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలతో పాటు ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని సోమవారం ప్రకటించింది.