తక్షణం జూరాల నుంచి నీరు విడుదల చేయాలి
ABN , Publish Date - Sep 22 , 2026 | 06:28 AM
కృష్ణా ఆయకట్టు రైతులకు సాగునీరందించేందుకు తక్షణం జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. అవసరమైతే, ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి నీటి విడుదల కోసం కర్ణాటక సీఎంతో చర్చించాలని సూచించారు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కృష్ణా ఆయకట్టు రైతులకు సాగునీరందించేందుకు తక్షణం జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. అవసరమైతే, ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి నీటి విడుదల కోసం కర్ణాటక సీఎంతో చర్చించాలని సూచించారు. బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖ ఇంజినీర్‌లతో కలిసి తమ పార్టీ ప్రతినిధి బృందం మంగళవారం జూరాల ప్రాజెక్టును సందర్శిస్తుందని తెలిపారు. ఆయకట్టు రైతులను కూడా కలుసుకుని, వారి ఇబ్బందులను తెలుసుకుంటామన్నారు. ‘ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం ఉంటుందని వాతావరణ నిపుణులు ముందే హెచ్చరించినా ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు? ప్రత్యామ్నాయ ప్రణాళికపై ఎందుకు సమీక్షించలేదు?’ అని ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనను ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. కీలక సమస్యలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని దుయ్యబట్టారు. అక్రమంగా ఫాం హౌజ్‌లు నిర్మించుకుంటే బీఆర్‌ఎస్ నేతలపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు.