ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి!
ABN , Publish Date - May 04 , 2026 | 05:01 AM
సోషల్‌మీడియాలో లైకులు, కామెంట్ల కోసం ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారి సంఖ్య దేశం లో పెరిగిపోతోంది.
వాటర్ ట్యాంక్‌పైకి ఐదుగురు బాలురు
మెట్లు కూలి ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
మరో ఇద్దర్ని కాపాడిన ఆర్మీ హెలికాప్టర్
లఖ్‌నవూ, మే 3: సోషల్‌మీడియాలో లైకులు, కామెంట్ల కోసం ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారి సంఖ్య దేశం లో పెరిగిపోతోంది. రీల్స్ మోజులో పడి 60 అడుగుల పాత వాటర్ ట్యాంక్ ఎక్కి.. ఐదుగురు పిల్లలు తమ ప్రాణాలనే పణంగా పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాశీరామ్ హౌసింగ్ ప్రాంతంలో ఉంటున్న సిద్ధార్థ్ (10), గోలు (12), సన్నీ (14), పవన్, షాదన్ రీల్స్ చేసేందుకు శనివారం మధ్యాహ్నం పాత వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కారు. అక్కడ రీల్స్ తీసుకున్న తర్వాత దిగుతుండగా.. ఒక్కసారిగా మెట్లు కూలిపోయాయి. దీంతో 50 అడుగుల ఎత్తు నుంచి సిద్ధార్థ్, గోలు, సన్నీ కిందపడిపోగా.. వారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. సిద్ధార్థ్ అప్పటికే మృతి చెందాడని, గోలు, సన్నీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇటు ట్యాంక్‌పైనే చిక్కుకున్న ఇద్దరిని కాపాడేందుకు అధికారులు చేసిన ప్రయత్నా లు.. వర్షం రావడం, చీకటి పడటంతో ఫలించలేదు. దీంతో ట్యాంకుపైనే వారు 16గంటలపాటు చిక్కుకోగా.. భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్‌ను రంగంలోకి దింపి అధికారులు వారిని కాపాడారు.