Share News

రెడ్కోలో అవినీతి తిమింగలం

ABN , Publish Date - Jul 23 , 2026 | 06:01 AM

విద్యుత్‌ శాఖ పరిధిలో మరో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ (రెడ్కో)లో డివిజనల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న..

రెడ్కోలో అవినీతి తిమింగలం

  • డీఈ ముత్యం వెంకటరమణ, బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు

  • గుట్టల బేగంపేటలో జీ+5, కూకట్‌పల్లిలో జీ+3 వాణిజ్య భవనాలు.. 2కిలోల బంగారు ఆభరణాలు

  • రూ.52 లక్షలు బ్యాంకు బ్యాలెన్స్‌.. ఇంకా తెరవాల్సి ఉన్న 10 లాకర్లు

  • భార్య, కుటుంబ సభ్యులతో కలిసి నాలుగు రియల్‌ఎస్టేట్‌ సంస్థల నిర్వహణ

  • 2019లో రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వెంకటరమణ

  • రెండేళ్లకుపైగా సస్పెన్షన్‌లో.. తర్వాత కీలక పోస్టింగ్‌.. భారీగా అక్రమాస్తులు

హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ శాఖ పరిధిలో మరో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ (రెడ్కో)లో డివిజనల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ముత్యం వెంకటరమణకు మార్కెట్‌ విలువ ప్రకారం రూ.100 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్టు తేల్చారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బుధవారం ఏసీబీ అధికారులు మాదాపూర్‌ హైటెక్స్‌ సమీపంలోని మీనాక్షి స్కైలాంజ్‌లో ఉన్న ఆయన ఇల్లు, హైదరాబాద్‌తోపాటు ఖమ్మం జిల్లాలో బంధువులు, బినామీల నివాసాల్లో కలిపి పది చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో నాలుగు ఫ్లాట్లు, కూకట్‌పల్లి ఆంజనేయనగర్‌లో జీప్లస్‌3 వాణిజ్యభవనం, గుట్టల బేగంపేటలో జీప్లస్‌ 5 వాణిజ్య భవనం వెంకటరమణ కుటుంబసభ్యుల పేరిట ఉన్నట్టు తేల్చారు. ఆయన బ్యాంకు ఖాతాల్లో రూ.52,02,585 సొమ్ము, ఇంట్లో రెండు కిలోల బంగారు ఆభరణాలు, రూ.45 లక్షల విలువైన మూడు వాహనాలు, రూ.30 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ.2.5 లక్షల విలువైన 20 విదేశీ మద్యం బాటిళ్లను గుర్తించారు. వెంకటరమణ, ఆయన కుటుంబసభ్యుల పేరిట పది బ్యాంకు లాకర్లు ఉన్నాయని, వాటిని తెరవాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు.


రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం వెంకటరమణ ఆస్తుల విలువ రూ.27,65,02,135 అని.. వాటి బహిరంగ మార్కెట్‌ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటరమణ 2019లో రంగారెడ్డి జిల్లా సైబర్‌ సిటీ సర్కిల్‌లో డీఈగా పనిచేస్తున్న సమయంలో రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేసి రూ.26,52,000 నగదు, రూ.22,60,585 విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసు నేపథ్యంలో 2019 డిసెంబర్‌ నుంచి 2022 ఫిబ్రవరి 1 వరకు సస్పెన్షన్‌లో ఉన్న వెంకటరమణ తర్వాత విధుల్లో చేరారు. కీలకమైన రెడ్కోలో డివిజనల్‌ ఇంజనీర్‌గా పోస్టింగ్‌ దక్కించుకున్నారు. ఆయన వద్ద ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో ఏసీబీ అధికారులు మంగళవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వెంకటరమణ సర్వీసులో చేరినప్పటి నుంచి అధికారిక ఆదాయం రూ.6.90కోట్లు మాత్రమే అయితే.. చేసిన వ్యయాలు రూ.20.35 కోట్లపైనే అని అందులో పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు సమయానికి రూ.4,09,36,565 విలువైన స్థిరాస్తులను గుర్తించామని.. అంటే రూ.17,54,96,565 మేర ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని స్పష్టం చేశారు. కోర్టు అనుమతితో బుధవారం సోదాలు చేశారు. సోదాల తర్వాత వెంకటరమణ అక్రమార్జన రిజిస్ట్రేషన్‌ విలువల ప్రకారం రూ.28,14,14,700గా తేలిందని, మార్కెట్‌ విలువ భారీగా ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు.


20 ఏళ్ల నుంచి నిర్మాణ రంగంలో..

1992లో విద్యుత్‌శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా చేరిన ముత్యం వెంకటరమణ.. తర్వాత హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సెంట్రల్‌ జోన్‌, అల్విన్‌ సెక్షన్‌తోపాటు పలు పోస్టుల్లో పనిచేశారు. ఎక్కువ కాలం ఆపరేషన్స్‌ విభాగంలో కొనసాగారు. తన భార్య స్వప్న, కుమార్తె సాత్విక, కుమారుడు రిత్విక్‌, తండ్రి వెంకన్న, మామ శివరాంబాబు, స్నేహితుడు రవికుమార్‌ పేరిట 2006లో రియల్‌ఎస్టేట్‌ సంస్థలను ప్రారంభించారు. ముత్యం కన్‌స్ట్రక్షన్స్‌, ముత్యం బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌, ప్రైడ్‌ హోమ్స్‌, ముత్యం అండ్‌ ఏఎస్ఎన్‌ఎల్‌ లైఫ్‌స్టయిల్‌ పేరిట సంస్థలను నెలకొల్పి.. కూకట్‌పల్లి, మూసాపేట వంటి ప్రాంతాల్లో రూ.20 కోట్ల వ్యయంతో పది నివాస కాంప్లెక్స్‌లు, రెండు వాణిజ్య సముదాయాలను నిర్మించారు.

Updated Date - Jul 23 , 2026 | 06:02 AM