ధాన్యం కొనుగోళ్లలో రికార్డు
ABN , Publish Date - May 31 , 2026 | 01:16 AM
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో జగిత్యాల జిల్లా మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నిజామాబాద్ ఉండగా రెండో స్థానంలో నల్గొండ జిల్లా ఉంది. జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే జిల్లాలో
జగిత్యాల, మే 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో జగిత్యాల జిల్లా మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నిజామాబాద్ ఉండగా రెండో స్థానంలో నల్గొండ జిల్లా ఉంది. జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే జిల్లాలో పలు కేంద్రాలు వంద శాతం కొనుగోళ్లు పూర్తి చేసి మూతపడ్డాయి. వచ్చే వారం రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో జిల్లాలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు.
ఫ3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు..
2025 యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 3.20 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందుకు గాను జిల్లాలో 4.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని తొలుత అంచనా వేశారు. ఈ మేరకు జిల్లా ఇందిరా క్రాంతి పథం, సహకార, మార్కెటింగ్, మెప్మా తదితర శాఖల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ నుంచి కేంద్రాలను ప్రారంభించి కొనుగోలు జరుపుతున్నారు. దిగుబడులు తగ్గడం వల్ల కేవలం 4.50 లక్షల వరకే ధాన్యం కేంద్రాలకు రానున్నట్లు ప్రస్తుతం గుర్తించారు.
ఫజిల్లాలో కొనుగోళ్లు ఇలా..
జిల్లా వ్యాప్తంగా 444 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 141 కేంద్రాలు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 302 కేంద్రాలను, మెప్మా ఆధ్వర్యంలో ఒక కేంద్రాన్ని ఏర్పరిచారు. జిల్లాలో ఇప్పటి వరకు 50,812 మంది రైతుల వద్ద నుంచి రూ.949.44 కోట్ల విలువ గల 3,97,591 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో రూ.821.65 కోట్ల విలువ గల 3,44,538 మెట్రిక్ టన్నుల ధాన్యం ట్యాబ్‌ల్లో అప్ లోడ్ చేశారు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యంలో 3,22,931 మెట్రిక్ టన్నులకు ట్రక్ షీట్ జనరేట్ అయింది. రూ.728.85 కోట్ల విలువ గల 3,05,086 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లారీల్లో లోడ్ చేసి గానుగాడించడం కోసం మిల్లర్లకు పంపగా ట్రక్‌షీట్ జనరేట్ అయింది. ఇందుకు గాను 50,593 మంది రైతులకు చెందిన 3,05,086 మెట్రిక్ టన్నులకు సంబంధించిన రూ.728.85 కోట్ల డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు.
ఫఇప్పటికే 54 కేంద్రాల మూత...
జిల్లాలోని పలు మండలాల్లో వంద శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసిన 54 కేంద్రాలను అధికారులు మూసివేశారు. ఇందులో 30 ఇందిరా క్రాంతిపథం కేంద్రాలు, 124 సహకార సంఘాల కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో రానున్న వారం రోజుల్లో అన్ని కేంద్రాల్లో వంద శాతం కొనుగోళ్లు పూర్తవుతాయన్న అంచనాల్లో అధికారులు ఉన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు సుమారు మరో 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
చివరి ధాన్యం గింజనూ కొంటాం
- బీఎస్ లత, అదనపు కలెక్టర్
జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను వంద శాతం పూర్తి చేస్తాం. చివరి గింజ వరకు కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. సాధ్యమైనంత త్వరగా కొనుగోళ్లు పూర్తి చేసే దిశగా పనిచేస్తున్నాం. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేయడం, ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయడం, లారీల్లో లోడింగ్ చేయడం, మిల్లర్లకు రవాణా చేయడం, మిల్లుల్లో అన్‌లోడింగ్, రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయడంలో ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.