రెబెల్‌గా గెలిచి.. పీఠంపై నిలిచి..
ABN , Publish Date - Feb 17 , 2026 | 07:04 AM
కామారెడ్డి మునిసిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఇప్ప ఉమారాణి పట్టణంలోని 38వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.
నిజామాబాద్ ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కామారెడ్డి మునిసిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఇప్ప ఉమారాణి పట్టణంలోని 38వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి రంగ మాధవిపై కేవలం మూడు ఓట్లతో గెలుపొందారు. ఈ వార్డులో మొదట ఉమారాణికే కాంగ్రెస్ టికెట్ రావాల్సి ఉంది. ఆమె భర్త శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకుడే. మొదటి నుంచి వీరు టికెట్ ఆశించినప్పటికీ కాంగ్రెస్ రంగమాధవికి టికెట్ ఇచ్చింది. దీంతో ఉమారాణి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో ఇదే వార్డు నుంచి పోటీ చేసిన ఇప్ప శ్రీనివా ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే వార్డులో ఆయనకు సానుభూతి పెరగడంతో ఎలాగైనా ఈసారి పోటీ చేయాలని సతీమణిని నిలబెట్టారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి కామారెడ్డి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.