Share News

ప్రీలాంచ్‌ పేరిట రూ.100 కోట్లు వసూలు

ABN , Publish Date - Jun 07 , 2026 | 06:19 AM

రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌, ప్రీలాంచ్‌ ఆఫర్‌ అంటూ రూ.100 కోట్ల మేర దండుకొని పరారైన మెసరా ఇన్‌ఫ్రా డెవలపర్‌ అధినేత మారెళ్ల పెంచల సుబ్పారెడ్డి అరెస్టు అయ్యారు..

ప్రీలాంచ్‌ పేరిట రూ.100 కోట్లు వసూలు

  • మెసరా ఇన్‌ఫ్రా అధినేత సుబ్బారెడ్డి అరెస్టు

గద్వాల క్రైం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌, ప్రీలాంచ్‌ ఆఫర్‌ అంటూ రూ.100 కోట్ల మేర దండుకొని పరారైన మెసరా ఇన్‌ఫ్రా డెవలపర్‌ అధినేత మారెళ్ల పెంచల సుబ్పారెడ్డి అరెస్టు అయ్యారు. పెంచల సుబ్బారెడ్డి హైదరాబాద్‌లోని కొల్లూరులో వివాదాస్పద భూములు తమవేనని నమ్మించి ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరిట వేర్వేరు వ్యక్తుల నుంచి రూ.100 కోట్ల మేర వసూళ్లు చేసి పరారయ్యాడు. మోసపోయిన వారిలో గద్వాల, అలంపూర్‌ ప్రాంతాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. కొంతకాలంగా పరారీలో ఉన్న సుబ్బారెడ్డి హైదరాబాద్‌, హైటెక్‌సిటీ ప్రాంతంలోని ఓ హోటల్‌లో ఉన్నట్టు సమాచారం అందుకున్న మాదాపూర్‌ పోలీసులు శనివారం అతడిని అరెస్టు చేశారు. అయితే, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్‌ చైర్మన్‌ గట్టు తిమ్మప్ప కూడా సుబ్బారెడ్డికి రూ. కోటి దాకా ముట్టజెప్పినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్‌లో అరెస్టు అయిన సుబ్బారెడ్డిని గద్వాల పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Jun 07 , 2026 | 06:19 AM