Share News

కొనుగోలుదారు డిక్లరేషన్‌ చాలు

ABN , Publish Date - Apr 28 , 2026 | 06:21 AM

సాదాబైనామా దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు వీలుగా ఆర్డీవోలకు నిర్ణయాధికారాన్ని ఇచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

కొనుగోలుదారు డిక్లరేషన్‌ చాలు

  • సాదాబైనామాలపై ఆర్డీవోలదే తుది నిర్ణయం

  • సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

  • ప్రతి జిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో

  • సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలను నిర్మిస్తాం

  • ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ

  • జిల్లాల సమీక్షలో రెవెన్యూ మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్ర జ్యోతి): సాదాబైనామా దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు వీలుగా ఆర్డీవోలకు నిర్ణయాధికారాన్ని ఇచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. సాదాబైనామా సమస్య పరిష్కారానికి కొనుగోలుదారు ఒక్కరే డిక్లరేషన్‌ ఇస్తే సరిపోతుందన్నారు. సోమవారం రెవెన్యూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల అధికారులతో హౌసింగ్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ సర్వేతోనే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం ఉంటుందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ నెల 2 నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా సర్వే మ్యాప్‌తో రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తరువాత సర్వే మ్యాప్‌, భూధార్‌ నంబరు కేటాయిస్తున్నామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా తహసీల్దార్‌ కార్యాలయాలు నిర్మిస్తామని, ప్రతి జిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు నిర్మిస్తామని చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దశాబ్దాలుగా రెవెన్యూ, అటవీ, దేవాదాయ, వక్ఫ్‌ మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయని, ఉమ్మడి సర్వే నిర్వహించి ఇటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలను అప్పగిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణ పురోగతిపై హౌసింగ్‌ అధికారులతో కలెక్టర్లు ప్రతి వారం సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఇళ్ల కేటాయింపు, లబ్ధిదారుల ఎంపికలో సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల వారీగా జరిగిన సమీక్షలో.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా మంత్రులు ప్రస్తావించిన అంశాలపై సమావేశంలోనే తగిన ఆదేశాలు జారీ చేశారు.


ఇందిరమ్మ ఇళ్లు నిరంతర ప్రక్రియ..

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకోనివారు ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా అర్హత ఉంటే ఇల్లు కేటాయిస్తామన్నారు. ఈ ప్రక్రియలో ప్రజా ప్రతినిధులంతా భాగస్వాములు కావాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణం జరిగేలా ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలన్నారు. వివిధ కారణాలతో ఇంటి నిర్మాణం చేసుకోలేని లబ్ధిదారులు తమకు ఇల్లు అవసరం లేదని భావిస్తే.. ఆ ఇంటిని అర్హత ఉన్న మరొకరికి కేటాయించాలని సూచించారు. బిల్లులు రానివారికి తక్షణమే బిల్లులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పూర్తి చేయాలన్నారు. పట్టణ పేదల కోసం స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా జీప్లస్‌ వన్‌ పద్ధతిలో ఇళ్లు నిర్మించుకునే వెసులబాటు కల్పించామని మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, మంత్రి జి.వివేక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 06:22 AM