హ్యామ్ చెల్లింపులకు ఆర్‌బీఐ గ్యారెంటీ!
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:40 AM
హ్యామ్ (హైబ్రీడ్ యాన్యుటీ మోడ్) విధానంలో రోడ్లను నిర్మించే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులపై పూర్తి భరోసా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఆర్‌అండ్‌బీ నుంచి అందకపోతేపీఎ్‌సఎఫ్ నుంచి.. అక్కడా అందకుంటే రిజర్వు బ్యాంకు నుంచి నేరుగా చెల్లింపు
కాంట్రాక్టర్ల నెట్‌వర్త్ 15ు ఉంటే చాలు
హైదరాబాద్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): హ్యామ్ (హైబ్రీడ్ యాన్యుటీ మోడ్) విధానంలో రోడ్లను నిర్మించే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులపై పూర్తి భరోసా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చెల్లింపులకు రిజర్వు బ్యాంకు గ్యారెంటీ సహా మూడు అంచెల విధానాన్ని ప్రకటించింది. దీనితో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి పెద్ద సంఖ్యలో సంస్థలు ముందుకొస్తాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. హ్యామ్ రోడ్ల కాంట్రాక్టర్లకు చెల్లింపుల భరోసాపై ‘ఆంధ్రజ్యోతి’ ముందే కథనాలు ప్రచురించింది. మూడు అంచెల్లో భాగంగా.. మొదట రోడ్లు-భవనాలశాఖ, పంచాయతీరాజ్ శాఖల నుంచి నిధులు చెల్లిస్తారు. ఒకవేళ అక్కడ చెల్లింపులు జరగకుంటే.. రెండో అంచెలో చెల్లింపు భద్రత నిధి (పేమెంట్ సెక్యూరిటీ ఫండ్- పీఎ్‌సఎఫ్) నుంచి చెల్లించేలా ఏర్పాటు చేస్తారు. అయినా కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగకుంటే రిజర్వు బ్యాంకు నుంచే నేరుగా చెల్లింపులు పొందేందుకు వీలుగా ‘డెడికేటెడ్ డెబిట్ మెకానిజం (డీడీఎం)’ అవకాశం ఉంటుంది. అంటే సదరు కాంట్రాక్టర్లకు చేయాల్సిన చెల్లింపులకు సంబంధించి రిజర్వు బ్యాంకుకు ‘ఎస్‌ఓపీ (స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)’ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. అంటే రిజర్వు బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందే రుణాలు, నిధుల నుంచి కోతపెట్టి నేరుగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తారు. ఈ విధానం వివరాలన్నీ హ్యామ్ టెండర్లలో పొందుపరుస్తారు. దీనికి సంబంధించి సీఎస్ కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఇక టెండరు నిబంధనల్లో కూడా పలు సడలింపులు ఇచ్చారు. హ్యామ్ రోడ్లకు టెండర్ వేసే కాంట్రాక్టర్లకు అంచనా వ్యయంలో కనీసం 20శాతం నెట్‌వర్త్ ఉండాలన్న నిబంధనను.. 15 శాతం ఉంటే చాలని సవరించారు. అంచనా వ్యయంలో 5శాతంగా ఉన్న పర్ఫార్మెన్స్ సెక్యూరిటీని 2.5 శాతానికి తగ్గించారు.