Road Development Projects: హ్యామ్‌కు ఆర్బీఐ గ్యారెంటీ
ABN , Publish Date - Jan 01 , 2026 | 06:31 AM
హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్(హ్యామ్)లో రోడ్లను అభివృద్ధి చేసేందుకు అవసరమయ్యే నిధులను తిరిగి చెల్లించే విషయమై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా...
కాంట్రాక్టర్లు-ప్రభుత్వం-బ్యాంకర్లతో నోడల్ ఏజెన్సీ.. బ్యాంకులకు 15 ఏళ్ల పాటు చెల్లింపులు
సర్కారు విఫలమైతే ‘ఎస్ర్కూ’ ద్వారా చెల్లించనున్న రిజర్వ్ బ్యాంకు
కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు తీసుకునేలా ఏర్పాటు
ఇప్పటికే ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్
త్వరలో క్యాబినెట్ ముందుకు ఫైల్
తొలి విడతలో 17,693 కోట్లతో 13,273 కి.మీ రోడ్ల అభివృద్ధి
హైదరాబాద్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్(హ్యామ్)లో రోడ్లను అభివృద్ధి చేసేందుకు అవసరమయ్యే నిధులను తిరిగి చెల్లించే విషయమై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గ్యారెంటీ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన అన్ని చర్యలను అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసినట్టు సమాచారం. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోని పలు రోడ్లను హ్యామ్ విధానంలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి విడత కింద ఆర్‌అండ్‌బీలో రూ.11,399 కోట్లతో 5,824 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి పనులు (మొత్తం 419పనులు), పంచాయతీరాజ్ శాఖ పరిధిలో రూ.6,294కోట్లతో 7,449 కిలోమీటర్ల రోడ్ల పనులు(17ప్యాకేజీలు) చేపట్టాలని నిర్ణయించారు. హ్యామ్ విధానంలో చేపట్టనున్న పనులకు 40శాతం నిధులను ప్రభుత్వం ముందుగానే చెల్లించనుండగా, మిగతా 60శాతం నిధులను బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో టెండరు పొందిన కాంట్రాక్టర్లే సమీకరించుకోవాల్సి ఉంటుంది. అయితే, తాము తీసుకున్న రుణాలకు సంబంధించిన చెల్లింపులు ఎలా చేస్తారు? ఎంత చేస్తారు? అనే అంశాలపై స్పష్టత కావాలని కాంట్రాక్టర్లు కోరారు. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోతే బ్యాంకుల్లో తమ కంపెనీలకు రేటింగ్‌లు తగ్గిపోవడంతో పాటు భవిష్యత్‌లో రుణాలు తీసుకునే వెసులుబాటు ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణాలతోనే ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలు హ్యామ్ రోడ్ల కోసం టెండర్లు పిలిచినా.. కాంట్రాక్టర్లు పాల్గొనలేదు. ప్రత్యేక ఖాతా తెరిచి బ్యాంకులకు చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా.. కాంట్రాక్టర్లు స్పందించలేదు.
దీనిపై మరింత లోతుగా పరిశీలన జరిపిన సర్కారు.. చివరకు హ్యామ్ చెల్లింపులపై ఆర్బీఐ గ్యారెంటీలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందుకోసం ప్రభుత్వం-కాంట్రాక్టర్లు-బ్యాంకులకు కలిపి (ట్రై పాడ్ అగ్రిమెంట్‌తో) ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తారు. అనంతరం ఎస్ర్కూ అకౌంట్(నేరుగా ఖాతాలకు డబ్బు చెల్లించే విఽధంగా ప్రత్యేక ఖాతా)ను ఓపెన్ చేస్తారు. పనులు దక్కించుకున్న సంస్థలు రుణాలు తీసుకున్న బ్యాంకులకు 15ఏళ్ల పాటు ప్రభుత్వం నుంచి సమయానికి చెల్లింపులు జరిగేలా సదరు నోడల్ ఏజెన్సీ పర్యవేక్షిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం చెల్లింపులు చేయడంలో విఫలమైతే ఆ విషయాన్ని సరదు ఏజెన్సీ ఆర్బీఐకి చేరవేస్తుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించాల్సిన రుణం మొత్తాన్ని ఆర్బీఐ చెల్లిస్తుంది. ఆ నిధులను కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధుల నుంచి తిరిగి జమ చేసుకుంటుంది. ఈ విధానంతో హ్యామ్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
త్వరలో క్యాబినెట్‌కు ఫైల్
హ్యామ్ ప్రాజెక్టు విషయంలో ఆర్బీఐ నుంచి గ్యారెంటీలు తీసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అనుమతి ఇచ్చినట్టు తెలిసింది. అందుకు సంబంధించిన వ్యవహారం మొత్తాన్ని ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఆర్థిక శాఖలు పూర్తి చేశాయి. ఈ ఫైలును మంత్రివర్గ సమావేశంలో పెట్టి ఆమోదం తీసుకున్నాక ఆర్బీఐను సంప్రదించనున్నారు. ప్రస్తుతం ఈ ఫైలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దగ్గర ఉందని, త్వరలోనే సీఎం రేవంత్, శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క దగ్గరకు వెళ్లనుందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఆర్బీఐ గ్యారెంటీల విషయంలో ఆర్థిక శాఖతో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల మధ్య త్వరలో కీలక సమావేశం జరగనుందని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యామ్‌ను ముందుకు తీసుకెళ్లాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందని ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు.
చట్టం తీసుకురావాలనే యోచన..
హ్యామ్ రోడ్ల పనుల కోసం ఆర్బీఐ నుంచి గ్యారెంటీలు తీసుకోవడం, ఆ తరువాత 15 ఏళ్ల పాటు చేయాల్సిన చెల్లింపులకు సంబంధించి భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. రుణ చెల్లింపులు ఎప్పుడు ప్రారంభమై.. ఎప్పుడు ముగుస్తాయన్న అంచనాలను అందులో పొందుపర్చనున్నట్లు తెలిసింది. తద్వారా ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. బ్యాంకులకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.