Share News

ఆ భూముల్లో వారసత్వ సంపద ఆనవాళ్లు లేవు

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:39 AM

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌ పాన్‌మక్త సర్వే నెంబర్‌ 83/1లోని దాదాపు పది ఎకరాల విస్తీర్ణం కలిగిన రెండు ప్లాట్ల వేలాన్ని కావాలనే కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని ప్రభుత్వం ఆరోపించింది.

ఆ భూముల్లో వారసత్వ సంపద ఆనవాళ్లు లేవు

  • హెరిటేజ్‌ ప్రాంతం దుర్గం చెరువు బఫర్‌ జోన్‌లో ఉంది

  • దానికి.. వేలం జరిగే ప్లాట్లకు సంబంధం లేదు

  • రాయదుర్గ్‌ పాన్‌మక్త ప్లాట్ల వేలంపై హైకోర్టులో ప్రభుత్వం వాదనలు

హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌ పాన్‌మక్త సర్వే నెంబర్‌ 83/1లోని దాదాపు పది ఎకరాల విస్తీర్ణం కలిగిన రెండు ప్లాట్ల వేలాన్ని కావాలనే కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని ప్రభుత్వం ఆరోపించింది. ఆ భూమిలో ఎలాంటి వారసత్వ సంపద ఆనవాళ్లు లేవని తెలిపింది. వేలానికి ప్రతిపాదించిన ప్లాట్లలో పురాతన శిలలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, ఆ భూమిని వేలం వేయరాదని పేర్కొంటూ డాక్టర్‌ రవీంద్రనాథ్‌ సూరి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ రజినీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 2013, 2026లో టెక్నికల్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం హెరిటేజ్‌ ఏరియా దుర్గం చెరువు బఫర్‌ జోన్‌లో ఉందని, ప్రస్తుత ప్లాట్లకు దానికి సంబంధం లేదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వం కౌంటర్‌ వేయాలని పేర్కొంటూ విచారణను సెప్టెంబర్‌ 16వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు, రాయదుర్గ్‌ పాన్‌మక్తలోని 83/1, 83/(పార్ట్‌) లలో తమకు 11.12 ఎకరాల భూమి ఉందని.. ప్రభుత్వం హద్దులు గుర్తించకుండానే అక్కడ వేలం నిర్వహణకు సంబంధించిన పనులు చేస్తోందని.. వాటిని అడ్డుకోవాలని కోరుతూ రమాదేవి, మరో 24 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేస్తూ విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - Aug 21 , 2026 | 06:49 AM