kumaram bheem asifabad- రేషన్ దందా.. అక్రమార్కుల పంథా
ABN , Publish Date - Aug 28 , 2026 | 10:48 PM
పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అధికారులు ఎప్పుటిక ప్పుడు దాడులు చేసి వాహనాలు, బియ్యం పట్టుకుం టున్నా అక్రమ దందా మాత్రం ఆగటం లేదు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి రేషన్ బియ్యం మహారాష్ట్రకు యఽథేచ్ఛగా తరలిపోతుంది
- మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న దళారులు
కాగజ్‌నగర్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అధికారులు ఎప్పుటిక ప్పుడు దాడులు చేసి వాహనాలు, బియ్యం పట్టుకుం టున్నా అక్రమ దందా మాత్రం ఆగటం లేదు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి రేషన్ బియ్యం మహారాష్ట్రకు యఽథేచ్ఛగా తరలిపోతుంది. అధికారులు నిఘా, తనిఖీలకు చిక్కకుండా అక్రమ రవాణాదారులు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ దందాను కొనసాగిస్తుండడం విశేషం. రేషన్ బియ్యం రైలు మార్గం గుండా పోయేందుకు రాత్రి వేళల్లో ప్యాసింజర్ రైలు ఉండడంతో పెద్దపల్లి, రామగుం డం, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ నుంచి ఈ బియ్యం తరలించే వారు. అయితే రైలు మార్గంపై అధికారులు గట్టి నిఘా పెట్టడం, కేసులు నమోదు చేయడంతో ఈ మార్గానికి బ్రేక్ పడింది.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలో మొత్తం 300 రేషన్ దుకాణాల పరిధిలో 1,39,773 కార్డుదారులు ఉన్నారు. ప్రతి నెలా కార్డుదారులకు 4,570 మెట్రిక్ టన్నుల క్వింటాళ్ల సన్నబియ్యం ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. జిల్లాలో నిత్యం బియ్యం దందా కొనసాగుతూ ఏదో ఒక చోట పట్టుబడుతున్నా రేషన్ బియ్యం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. రైళ్ల ద్వారా తరలింపుపై నిఘా పెరుగడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వాహనాల్లో బియ్యాన్ని సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిన్న వాహనాల నుంచి పెద్ద వాహనాల వరకు వినియోగిస్తూ తనిఖీలను తప్పిం చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగజ్‌నగర్-సి ర్పూరు(టి) అంతరాష్ట్ర రహదారి ద్వారా తరలి స్తున్నారు. ఈ మార్గంలోనే రాత్రి వేళల్లోనే అధికంగా తరలిస్తున్నారు. అలాగే కౌటాల ప్రాణహిత నదిపై కూడా తరలిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం మీదుగా వాంకిడి నుంచి మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందా అంతా కూడా రాత్రివేళల్లో జరుగుతుంది. జిల్లాలో పలు ప్రాంతాల్లో సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి 30 కేసులను నమోదు చేశారు అయినా అక్రమ దందా పూర్తిగా కట్టడి కావడం లేదు. అధికారుల కంట పడకుండా సరిహద్దు దాటుతున్నది మరెంతో అన్న చర్చ ప్రజల్లో సాగుతోంది.
- మహారాష్ట్ర సరిహద్దుకు..
మహారాష్ట్ర సరిహద్దుకు అనుకుని ఉన్న మం డలాల, మారుమూల గ్రామాలను అక్రమ రవాణా దారులు అడ్డాలుగా మార్చుకుంటున్నారు. రేషన్ బియ్యాన్ని తక్కువ ధరలకు సేకరించి సరిహద్దు దాటించి అనంతరం అధిక ధరకు విక్రయిస్తూ అక్రమార్కులు భారీగా లాభాలు గడిస్తున్నారని చెబుతున్నారు. రేషన్ పంపిణీ నెల మొదటి వారంలో అందజేస్తున్నారు. దీంతో అక్రమార్కులు కాగజ్‌నగర్, దహెగాం, భీమిని, ఆసిఫాబాద్, వాంకిడి, సిర్పూరు(టి), బెజ్జూరు, పెంచికల్‌పేట తదితర మండలాల నుంచి కొంత మంది బ్రోకర్లు నేరుగా లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి రాత్రికి రాత్రే వివిధ వాహనాల్లో మహారాష్ట్రకు తరలిస్తున్నా రు. చంద్రాపూర్‌లో రైల్వే, బస్టాండు మార్గంలోని కూత వేటు దూరంలోనే గోడౌన్ ఉండడం, అక్కడే నేరుగా తూకం వేసుకొని అమ్మకాలు జరుపుకొని అక్కడికక్కడే డబ్బులు ఇస్తుండడంతో ఈ దందాను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా రేషన్ బియ్యం ఈ ప్రాంతంలో లబ్ధిదారుల వద్ద రూ.10 చొప్పున కొనుగోలు చేసి మహారాష్ట్రలో రూ.25 చొప్పున విక్రయిస్తున్నారు. లాభాలు ఉండడంతో పలువురు అక్రమార్కులు ఈ వ్యాపారాన్ని కొనసాగి స్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.