Share News

ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని రాస్తారోకో

ABN , Publish Date - Apr 27 , 2026 | 10:56 PM

యాసంగిలో రైతులు పండించిన వరి, మొక్కజొన్న పంటల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వెంటనే తూకాలను ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేటలో అన్నదాతలు సోమవారం రాస్తారోకో నిర్వహించారు.

 ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని రాస్తారోకో
ముత్యంపేటలో రోడ్డెక్కి రాస్తారోకో చేస్తున్న అన్నదాతలు, బిజేపి నాయకులు.

దండేపల్లి ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): యాసంగిలో రైతులు పండించిన వరి, మొక్కజొన్న పంటల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వెంటనే తూకాలను ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేటలో అన్నదాతలు సోమవారం రాస్తారోకో నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ముత్యంపేటలో వంతెన వద్దకు చేరుకుని బైఠాయించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము పగలు రాత్రి తేడా లేకుండా ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తూ రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్నామన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ధాన్యం తూకం వేయడం లేదని వాపోయారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం, అఽధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న ఎస్సై తహసీనోద్దీన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. రైతులు వినకపోవడంతో ఎస్సై తహసీల్దార్‌తో ఫోన్‌లో రైతులతో మాట్లాడించారు. రేపటి వరకు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని తహసీల్దార్‌ రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Updated Date - Apr 27 , 2026 | 10:56 PM