తెలంగాణలో గణపతిదేవుడి తొలి శిల్పం
ABN , Publish Date - May 25 , 2026 | 05:28 AM
తెలుగు నేలను సామాన్య శకం 1199 నుంచి సామాన్య శకం 1262 వరకు పరిపాలించిన కాకతీయ గణపతి దేవుని ప్రతిమను సిద్దిపేట జిల్లా తోటపల్లి శివాలయంలో గుర్తించారు.
సిద్దిపేట జిల్లా తోటపల్లి శివాలయంలో..
హైదరాబాద్ సిటీ, మే25(ఆంధ్రజ్యోతి): తెలుగు నేలను సామాన్య శకం 1199 నుంచి సామాన్య శకం 1262 వరకు పరిపాలించిన కాకతీయ గణపతి దేవుని ప్రతిమను సిద్దిపేట జిల్లా తోటపల్లి శివాలయంలో గుర్తించారు. తెలంగాణలో గణపతి దేవుడి మొట్టమొదటి శిల్పం ఇదేనని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. పురాతన స్థలాలు, చారిత్రక, వారసత్వ కట్టడాల పరిరక్షణపై గ్రామీణులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లాలోని నంగునూరు, కొండపాక, తోటపల్లి, లకుడారం గ్రామాలను శివనాగిరెడ్డి, శ్రీరామోజు హరగోపాల్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామ శివాలయం రంగమండపంలో గణపతి దేవుడు, సోమలా దేవి దంపతులతో పాటు రాజ గురువు విశ్వేశ్వర శివాచార్యులు, పరిచారిక ప్రతిమలున్న శిల్పాన్ని గుర్తించారు. గోళకి మఠాధిపతి, రాజ గురువు విశ్వేశ్వర శివాచార్యుడి అర్చకత్వంలో శివదీక్షలో గణపతి దేవుడు సతీ సమేతంగా శివలింగానికి పూజ చేస్తున్నట్లు శిల్పంలో కనపడుతుంది. రాచరికపు చిహ్నాలు పక్కనపెట్టి తలపై శిఖ, మెడలో రుద్రాక్షలను ధరించిన గణపతి దేవుడి దంపతుల ప్రతి రూపాలు శిల్పంలో కనపడుతున్నాయి. తెలంగాణ చరిత్రలోనే అత్యంత అరుదైన, విశేషమైన ఈ శిల్పాన్ని ప్రభుత్వం పరిరక్షించాలని శివనాగిరెడ్డి కోరారు.