చెన్నిపాడులో అరుదైన శిలా విగ్రహం
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:19 AM
జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని చెన్నిపాడు గ్రామంలో అరుదైన శిలా విగ్రహం వెలుగు చూసింది. గ్రామంలో 1932లో...
సప్త స్వరాలు పలుకుతున్న చెన్నకేశవస్వామి మూర్తి
పరిశీలించిన పురావస్తుశాఖ సిబ్బంది
అలంపూరు చౌరస్తా/మానవపాడు, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని చెన్నిపాడు గ్రామంలో అరుదైన శిలా విగ్రహం వెలుగు చూసింది. గ్రామంలో 1932లో ఏర్పాటైన పురాతన గ్రంథాలయాన్ని, తాళపత్ర గ్రంథాలను, చరిత్రను పరిశీలించేందుకు పురావస్తుశాఖ సిబ్బంది పర్యటించారు. గ్రామంలోని చెన్నకేశస్వామి ఆలయ విశిష్ఠతపై గ్రామపెద్దలు ముల్కి సీతారామిరెడ్డి, రావిచెట్టు తిరుమలనాథ్‌రెడ్డి వారికి వివరించారు. ఆలయం ఆవరణలో ప్రతిష్ఠించి ఉన్న చెన్నకేశవస్వామి విగ్రహాన్ని పరిశీలించిన పురావస్తుశాఖ సిబ్బంది అది అత్యంత అరుదైనదిగా గుర్తించారు. విగ్రహాన్ని రాయితో మీటగా ఒక్కో చోట ఒక్కో రీతిగా సప్తస్వరాలు పలుకుతున్నట్లు గుర్తించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కడా ఇలాంటి విగ్రహం లేదన్నారు. దీనిని ఏడవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల వారు ప్రతిష్ఠించారని గ్రామ పెద్దలు వారికి తెలిపారు. ఆ తర్వాత నవాబుల దాడుల్లో విగ్రహం పాక్షికంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. ఆలయ పరిసరాలలో సంస్కృతం, కన్నడ, తెలుగు భాషల్లో ఉన్న శిలాఫలకాలను కూడా పరిశీలించారు.