నాలుగైదు రోజుల్లో కొనుగోళ్లు పూర్తవ్వాలి
ABN , Publish Date - May 29 , 2026 | 03:31 AM
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, ఎస్పీలు, రోడ్డు రవాణా అధికారులు తదితర యంత్రాంగమంతా ధాన్యం సేకరణపైనే దృష్టి సారించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు.
యంత్రాంగమంతా ధాన్యం సేకరణపై దృష్టి పెట్టాలి.. తడిచిన ధాన్యానికి సైతం మద్దతు ధర చెల్లించాలి
రవాణాకు ఇసుక లారీలనూ వినియోగించుకోండి
సమీక్షలో అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్ ఆదేశం
బీజేపీ, బీఆర్‌ఎస్.. రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజం
ఫోజులు మానేసి.. కేంద్రంపై ఒత్తిడి తేండి: పొంగులేటి
కిరాయి గోదాములకు ధాన్యం తరలిస్తాం: శ్రీధర్‌బాబు
యాదాద్రి, పెద్దపల్లి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల పరిశీలన
యాదాద్రి/పెద్దపల్లి/హనుమకొండ కలెక్టరేట్, మే 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, ఎస్పీలు, రోడ్డు రవాణా అధికారులు తదితర యంత్రాంగమంతా ధాన్యం సేకరణపైనే దృష్టి సారించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. నాలుగైదు రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు. యాదాద్రి జిల్లాలోని వంగపల్లి, పెద్దపల్లి జిల్లాలోని పెద్దకల్వలలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులతో కలిసి ఉత్తమ్ పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యాదాద్రి, పెద్దపల్లి, హనుమకొండ కలెక్టరేట్లలో అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికార యంత్రాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం సహాయ, సహకారాలు అందిస్తారని తెలిపారు. ఎక్కడైనా లారీల కొరత ఉంటే నాలుగైదు రోజుల పాటు ఇసుక లారీలు, పరిశ్రమల లారీలను సైతం ధాన్యం రవాణాకు వినియోగించాలని సూచించారు. తాలు, తరుగు పేరిట కోతలు పెడితే కఠిన చర్యలు తప్పవని రైస్‌మిల్లర్లను హెచ్చరించామన్నారు. బెంగాల్, బిహార్ హమాలీలు.. స్వరాష్ట్రాలకు వెళ్లడంతో రవాణాలో జాప్యం జరిగిందన్నారు. రైతు పండించిన చివరి గింజ కొనే వరకూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియను కొనసాగిస్తామని చెప్పారు. కొన్ని చోట్ల అధికారులు ఇచ్చిన నివేదికలకు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు పొంతన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిచినా.. కనీస మద్దతు ధర అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 58 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి, 8 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.11వేల కోట్లు జమ చేశామని గుర్తు చేశారు. మిగతా 15-18లక్షల టన్నుల ధాన్యాన్ని సైతం వేగంగా సేకరిస్తామన్నారు.
ప్రస్తుత యాసంగి సీజన్‌లో 75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, కేంద్రం మాత్రం 51లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసేందుకు అనుమతించిందన్నారు. ధాన్యానికి మద్దతు ధర ప్రకటించడం తప్ప కేంద్రం చేసిందేమీ లేదని, రాష్ట్రానికి సహకరించడం లేదని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు బీఆర్‌ఎస్, బీజేపీ.. రాజకీయంగా రైతులను ఆందోళనలకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఫొటోలకు ఫోజులు ఇవ్వడం మానేసి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు కృషి చేయాలని సూచించారు. ధాన్యం అంటే తెలియని నాయకులు కూడా రైతులపై ప్రేమ ఒలకపోస్తూ, మొసలి కన్నీరు కార్చడం నవ్వు తెప్పిస్తోందన్నారు. రైతులకు సంకెళ్లు వేసి, జైలులో పెట్టిన నాయకులు, ఏనాడూ రైతులకు మేలు చేయని నాయకులు కూడా రోడ్డెక్కుతున్నారని విమర్శించారు.న్నారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని స్పష్టం చేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ధాన్యం, మొక్కజొన్న రైతులు అధైర్యపడవద్దని సూచించారు. యాసంగి సీజన్‌లో పంట బాగా వచ్చిందని, తాత్కాలికంగా గోదాములను కిరాయికి తీసుకుని ధాన్యాన్ని తరలిస్తున్నామన్నారు.