ఎన్నికల ప్రచారానికి తెర.. ప్రలోభాల ఎర..
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:28 AM
ఎన్నికలు ఏవైనా ప్రలోభాలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ప్రచారానికి తెరపడగా.. ప్రలోభాల పర్వానికి తెరలేచింది! అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ఏమాత్రం...
రంగారెడ్డి జిల్లా పురపోరులో నోట్ల వరద.. ఆరు పురపాలికల్లో రూ.250 కోట్ల ఖర్చు!
శంకరపల్లి, మొయినాబాద్, చేవెళ్లలో పోటాపోటీ పంపిణీ
కుటుంబ అవసరాలన్నీ తీర్చేస్తున్న అభ్యర్థులు.. శంకరపల్లిలో కొందరి ఖర్చు 6-8 కోట్లు
చేవెళ్లలో ఇంటింటికీ అర తులం బంగారం ఆఫర్!!.. వలస ఓటర్లకూ తాయిలాలు
రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికల్లో ఓటర్లకు భారీఎత్తున నగదు పంపిణీ
నేడు పతాకస్థాయికి చేరే అవకాశం.. పార్టీ ఫండ్‌పై కొందరు అభ్యర్థుల ఆశలు
రంగారెడ్డిజిల్లా ప్రతినిధి/హైదరాబాద్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు ఏవైనా.. ప్రలోభాలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ప్రచారానికి తెరపడగా.. ప్రలోభాల పర్వానికి తెరలేచింది! అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ఏమాత్రం తీసిపోనట్లుగా తాయిలాలు, నగదు పంపిణీ జరుగుతున్నాయి. కొన్ని వార్డుల్లో అభ్యర్థులు పోటీలు పడి మరీ పంపిణీ చేస్తున్నారు. డబ్బు, మద్యం, చీరలు, వంట సామాన్లు.. ఇలా ‘కాదేదీ పంపిణీకి అనర్హం’ అన్నట్లుగా ఓటర్లకు పంచేసి, వారిని ప్రసన్నం చేసుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఇంతకుముందెన్నడూ లేని విధంగా మునిసిపాలిటీ ఎన్నికల్లో డబ్బు వెదజల్లుతున్నారు. కొందరు తమను గెలిపిస్తే ‘బంగారం ఇస్తాం.. పెన్షన్లు ఇస్తాం’ అంటూ హామీలు గుప్పిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు పార్టీ ఫండ్ రూపంలో పెద్దమొత్తం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ డబ్బు కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. సోమవారం రాత్రికే ఆ సొమ్ము చేరాల్సిన చోటుకు చేరిపోతుందని.. మంగళవారం ప్రలోభాలు పతాక స్థాయికి చేరతాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. 11న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుండడంతో ఓట్ల కోసం తమ ప్రత్యర్థి ఎంత ఇవ్వబోతున్నారో పసిగట్టి ఆ మొత్తానికి మించి పంపిణీ చేసేందుకు పలు చోట్ల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. పలు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటుకు రూ.500-3000 వరకు పంచనున్నట్లు సమాచారం. పార్టీ ఫండ్‌తో పాటు అభ్యర్థులు సొంతంగా కూడా పెద్దమొత్తం పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ మునిసిపాలిటీలో అభ్యర్థి ఏకంగా ఓటుకు రూ.30 వేలు పంచుతున్నట్లు తెలిసింది!!
రాష్ట్రవ్యాప్తంగా 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో హోరాహోరీగా సాగిన ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఆయా పురపాలికల్లో ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించడంపై దృష్టి సారించాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లాంటి కొన్ని జిల్లాల్లో పంపిణీ ప్రారంభమైపోయింది. రంగారెడ్డి జిల్లాలో పంపిణీ కొత్తపుంతలు తొక్కుతోంది. జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న ఆరు పురపాలికల్లో 1.75 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కానీ, ఆయా పార్టీల అభ్యర్థులు చేస్తున్న ఖర్చు అక్షరాల రూ.250 కోట్లపైనే!! అమన్‌గల్లు, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, శంకరపల్లి మొయినాబాద్ పురపాలికల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. శంకరపల్లి, చేవెళ్ల, మొయినాబాద్‌ల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీపడి డబ్బు వెదజల్లుతున్నారు. శంకరపల్లిలోని ఓ వార్డులో అభ్యర్థులు రూ.8 కోట్లకు పైగానే ఖర్చుచేస్తున్నారు. ఈ మునిసిపాలిటీలో మరో నాలుగు వార్డుల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. డబ్బు, మందు, మాంసం.. తదితర రూపాల్లో విచల్చవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఓటర్లకు వెండి నాణేలు, టీవీలు, ఫ్రిజ్‌లు, మిక్సీలు, చీరలు, స్టౌలు పోటీపడి పంచుతున్నారు. అనేక వార్డుల్లో ప్రతి ఇంటికీ కిలో చికెన్, పురుషులకు మద్యం బాటిళ్లు అందజేస్తున్నారు. తమకే ఓటు వేయాలని దేవుడి చిత్రపటాలు ఉంచి ఓటర్లతో ఒట్లు పెట్టించుకుంటున్నారు.
వంటింటి సామగ్రి అంతా ఇచ్చేశారు!
మొయినాబాద్ మునిసిపాలిటీలోని ఓ వార్డులో అభ్యర్థులు పోటీ పడి ఓటర్లందరికీ వంటింటి సామగ్రి అంతా పంపిణీ చేశారు. ఓ అభ్యర్థి అక్కడ తొలుత ఇంటింటికీ అదనపు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేశారు. ఇది తెలుసుకున్న మరో అభ్యర్థి గ్యాస్ స్టౌలు పంపిణీ చేశాడు. మొదటి అభ్యర్థి మళ్లీ ఇంటింటికీ వెళ్లి 25 కిలోల బియ్యం బస్తాలను పంపిణీ చేశాడు. రెండో అభ్యర్థి మరోసారి ఇంటింటికీ కుక్కర్లు ఇచ్చాడు. ఇలా ఆ వార్డులోని ఓటర్లకు వంటింటి సామగ్రి మొత్తం అందింది. ఇది చూసి పక్క వార్డుల్లో కూడా కుక్కర్లు, స్టౌలు, టీవీలు వంటి వస్తువుల పంపిణీ మొదలెట్టారు.
శంకరపల్లిలో రూ.50 కోట్లకు పైనే..
హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లిలో 15 వార్డుల్లో 21,401 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ చైర్మన్ స్థానం జనరల్ కావడంతో ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్నారు. 8, 10, 13, 14, 15 వార్డుల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు రూ.కోట్లు వెదజల్లుతున్నారు. ఒక్కో వార్డులో అన్ని పార్టీలు కలిపి రూ.6-8 కోట్ల వరకు పంపిణీ చేస్తుండడం గమనార్హం. ఒక్కో ఓటుకు రూ.25-30 వేల చొప్పున ఇస్తున్నారు. ఓ వార్డు నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థి ఇంటింటికీచీరలు, వెండి నాణెంతో పాటు ఓటుకు30 వేలు చొప్పున పంపిణీ చేస్తున్నారు. తన ప్రత్యర్థి పోటీ వస్తే రూ.40 వేలైనా ఇచ్చేందుకు సిద్ధమని చెబుతున్నాడు. ఇక్కడ అభ్యర్థులంతా కలిసి దాదాపు రూ.50 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారు.
చేవెళ్ల చైర్మన్‌గిరీ కోసం రూ.15 కోట్లు!
చేవెళ్లలో చైర్మన్ పదవి ఆశిస్తున్న ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ఇప్పటికే రూ.15 కోట్లు ఖర్చుపెట్టారు. మునిసిపాలిటీలో తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వార్డు అభ్యర్థులు ఒక్కొక్కరికీ రూ.30-50 లక్షల వరకు ఇచ్చారు. ఇవిగాక స్థానిక నేతలకు రూ.8 కోట్లకుపైనే ఇచ్చినట్లు సమాచారం. షాద్‌నగర్‌లో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి కూడా స్థానిక వార్డుల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్థులకు పార్టీ ద్వారా రూ.3 కోట్లు పంపిణీ చేశారు.
గెలిపిస్తే అర తులం బంగారం!
చేవెళ్లలో 16వ వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థి తనను గెలిపిస్తే ఇంటింటికీ అర తులం బంగారం పంపిణీ చేస్తానని కరపత్రం విడుదల చేశారు. ప్రతి పింఛనుదారుకు తన వంతుగా రూ.500, ఆరునెలలు నిండిన గర్భిణులకు పౌష్టికాహారం కోసం రూ.10 వేలు అందిస్తానని ప్రకటించారు. ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే రూ.20 వేలు ఇస్తానని ప్రకటించారు. మెయినాబాద్‌లో ఓ అభ్యర్థి తనను గెలిపిస్తే అర్హత ఉండీ పింఛను రాని వారందరికీ ఫ్రభుత్వం నుంచి పింఛను వచ్చేదాకా నెలకు రూ.1000 ఇస్తానని హామీ ఇస్తున్నాడు.
వలస ఓటర్లకు వల
ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లిన వలస ఓటర్లపైనా అభ్యర్థులు దృష్టి సారించారు. వారికి ప్రయాణ ఖర్చులతో పాటు ఓటుకు కొంత డబ్బులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. కొందరికి విమాన టికెట్లూ బుక్ చేస్తున్నారు. ఖర్చులకు ముందుగానే గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపిస్తున్నారు.
మంచిర్యాలలో ఓటుకు 2000
మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటుకు రూ.1500-2000 వరకు పంచినట్లు సమాచారం. బీజేపీ అభ్యర్థులు రూ.1000 వరకు ఇచ్చారు. బీజేపీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న నేత తన డివిజన్‌లో ఏకంగా రూ.3 వేలు పంపిణీ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులు రూ.500-1000 వరకు ఇస్తున్నారు. గట్టిపోటీ ఉన్న వార్డులు, డివిజన్లలో అభ్యర్థులు పోటాపోటీగా నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్ని వార్డుల్లో 70-80 శాతం మంది ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు ఒక పార్టీ ఏర్పాట్లు చేసుకోగా, ఏయే వర్గానికి ఎంత ఇవ్వాలన్నదానిపై మరో పార్టీ జాబితాలు రూపొందించుకుంది. ‘పది మంది ఓటర్లున్న ఉమ్మడి కుటుంబంలో ఒక ప్యాకేజీ (చికెన్, మటన్, మద్యంతో పాటు రూ.30 వేల నగదు), కీలక ఓటు బ్యాంకు ఉన్న సామాజిక వర్గాలకు మరో ప్యాకేజీ (50-100 ఓట్లు ఉంటే చికెన్, మటన్, మద్యంతో పాటు రూ.50 వేలు)’ అందిస్తున్నట్లు ఓ పార్టీ సీనియర్ నేత వెల్లడించారు.
రెబెల్స్ సైతం రెడీ..!
రాష్ట్రవ్యాప్తంగా పలు వార్డులు, డివిజన్లలో రెబెల్స్‌గా బరిలోకి దిగిన అభ్యర్థులు కూడా పెద్దఎత్తున నగదు పంపిణీకి సిద్ధమయ్యారు. కొన్ని వార్డుల్లో ప్రధాన పార్టీల రెబెల్స్ ఐదారుగురు పోటీలో ఉన్నారు. గెలుపుపై ధీమాతో ఉన్న వీరు.. ప్రత్యర్థులకు దీటుగా డబ్బు పంపిణీకి సిద్ధమయ్యారు.