Rangareddy MPDO Caught in Bribery: నిర్మాణ అనుమతుల జారీకి రూ.2.50 లక్షల లంచం
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:31 AM
భవన నిర్మాణానికి అవసరమైన అనుమతుల జారీకి రూ.2.50 లక్షల లంచం డిమాండ్ చేసిన రంగారెడ్డి జిల్లా నందిగామ ఎంపీడీవో సుమతి అవినీతి నిరోధక శాఖ...
ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా నందిగామ ఎంపీడీవో సుమతి
ఆమెతోపాటు ఎంపీవో,గ్రామ కార్యదర్శి కూడా
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి ఏసీబీ
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
నందిగామ, జనవరి 7(ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణానికి అవసరమైన అనుమతుల జారీకి రూ.2.50 లక్షల లంచం డిమాండ్ చేసిన రంగారెడ్డి జిల్లా నందిగామ ఎంపీడీవో సుమతి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. ఆమెకు సహకరించిన ఎంపీవో, గ్రామ కార్యదర్శిని కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నందిగామ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నందిగామ మండలం నాగులపల్లిలోని ఓ రిసార్ట్ యజమాని.. తన రిసార్ట్‌లో అదనపు భవనాల నిర్మాణం కోసం ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి అనుమతులు ఇవ్వాలని కోరారు. దీంతో రిసార్ట్ పరిశీలనకు వచ్చిన ఈదులపల్లి గ్రామ కార్యదర్శి చెన్నయ్య అనుమతుల జారీకి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. దీంతో రిసార్ట్ యజమాని నేరుగా ఎంపీడీవో పొన్న సుమతితో మాట్లాడగా.. రూ.2.50 లక్షలు లంచం ఇస్తేనే అనుమతులు ఇస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు రిసార్ట్ యజమాని రూ.1.50 లక్షలు చెల్లించారు. మిగిలిన రూ.లక్ష కూడా ఇవ్వాలని అధికారులు పట్టుబట్టడంతో రిసార్ట్ యజమాని ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం రూ.లక్ష తీసుకొని ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లిన రిసార్ట్ యజమాని.. గ్రామ కార్యదర్శి చెన్నయ్యకు ఆ డబ్బు ఇచ్చిన వెంటనే ఏసీబీ డీసీపీ ఆనంద్ తన బృందంతో దాడి చేశారు. ఎంపీడీవో సుమతి, మండల పంచాయతీ రాజ్ ఆఫీసర్ (ఎంపీవో) వడిత్యా తేజ్‌నాయక్, గ్రామ కార్యదర్శి చెన్నయ్యను అరెస్టు చేశారు. నాంపల్లిలోని ఏసీబీ కోర్టు స్పెషల్ జడ్జి ఆదేశాల మేరకు నిందితులను రిమాండ్‌కు తరలించారు. కాగా, హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఉన్న ఎంపీడీవో సుమతి నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం.