Share News

రెండు భారీ క్రేన్లు కూలి..ఐదుగురి మృతి

ABN , Publish Date - Apr 28 , 2026 | 06:37 AM

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మహాలింగాపురంలోని ఎన్‌సీసీ పరిశ్రమలో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

రెండు భారీ క్రేన్లు కూలి..ఐదుగురి మృతి

  • మరో 12 మందికి గాయాలు

  • ఈదురుగాలులకు లాక్‌లు ఫెయిల్‌

  • వర్షంతో కార్మికులు తలదాచుకున్న షెడ్డుపై పడిపోయిన గ్యాంట్రీ క్రేన్లు

  • రంగారెడ్డి జిల్లా మహాలింగాపురం ఎన్‌సీసీ పరిశ్రమలో దుర్ఘటన

శంకర్‌పల్లి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మహాలింగాపురంలోని ఎన్‌సీసీ పరిశ్రమలో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు భారీ గ్యాంట్రీ క్రేన్‌లు కూలి షెడ్‌ మీద పడడంతో ఆ షెడ్‌లో ఉన్న అయిదుగురు కార్మికులు మృతిచెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఇతర రాష్ట్రాల నుంచి బతుకుతెరువు కోసం వచ్చిన కార్మికులు. పోలీసులు, కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌సీసీ పరిశ్రమలో భారీ బ్రిడ్జిల కోసం రెయిలింగ్‌లు తయారుచేస్తుంటారు. సోమవారం సాయంత్రం కార్మికులు పనిచేస్తుండగా ఈదురుగాలులు, వాన మొదలయ్యాయి. దాంతో 17మంది కార్మికులు పరిశ్రమలోని ఓ షెడ్‌లో తలదాచుకున్నారు. ఈదురుగాలుల ధాటికి భారీ రెండు గ్యాంట్రీ క్రేన్‌లు లాక్‌లు ఫెయిలై కదిలి కార్మికులు ఉన్న షెడ్‌పై పడ్డాయి. లాక్‌లు ఫెయిల్‌ కావడంతో మొదట ఓ గ్యాంట్రీ క్రేన్‌ కదలిక మొదలైంది. తర్వాత పక్కనే ఉన్న మరో గ్యాంట్రీ క్రేన్‌ లాక్‌లు ఫెయిలై.. ఒకదానిపై ఒకటి పడి ఆపై షెడ్‌పై కూలిపోయాయి. దాంతో కుప్పకూలిన షెడ్‌, క్రేన్ల కింద నలిగి అయిదుగురు కార్మికులు అక్కడిక్కడే మృతిచెందారు. గ్యాస్‌ కట్టర్‌తో క్రేన్‌ను కట్‌ చేసి మృతదేహలను బయటకుతీశారు. మృతులను బిహార్‌కు చెందిన అలీ హుస్సేన్‌ (37), నాగేంద్ర మాథూర్‌ (38), ఎండీ సాజిమ్‌ (36), ముఖేష్‌ కుమార్‌ (20), ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోను చౌదరి (26)గా గుర్తించారు. గాయపడిన మిథున్‌, పితు, సోమ్‌నాథ్‌, వీరబహదూర్‌, పవన్‌కుమార్‌, కుమార్‌, దినేశ్‌ కుమార్‌, సియారామ్‌, సహదేవ్‌, సుదర్శన్‌, రాంబచ్చన్‌, కండల సురేష్‌ అనే కార్మికులు శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


భద్రతా ప్రమాణాలపై అనుమానం

ఎన్‌సీసీ పరిశ్రమలో యంత్రాల భద్రతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, డీసీపీ యోగేష్‌ గౌతమ్‌, ఆర్డీవో పార్థసింహారెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాలి దుమారానికే ఇంత పెద్ద గ్యాంట్రీ క్రేన్‌ల లాక్‌లు ఎలా ఊడిపోతాయని కంపెనీ ప్రతినిధులను డీసీపీ ప్రశ్నించారు. కాగా, మృతిచెందిన ఐదుగురు కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని, క్షతగాత్రులను ఆదుకుంటామని ఎన్‌సీసీ కంపెనీ నిర్వహకులు హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంపై మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Updated Date - Apr 28 , 2026 | 06:38 AM