మరికొందరికి డ్రగ్స్ లింకులు?
ABN , Publish Date - Mar 26 , 2026 | 04:37 AM
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫాంహౌస్‌లో కాల్పులు, డ్రగ్స్ కేసుకు సంబంధించి నిందితుల నుంచి సిట్ అధికారులు మరింత కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది.
రెండో రోజు కస్టడీలో నిందితుల విచారణ.. ఫాంహౌస్ కాల్పుల ఘటనపై సిట్ ప్రశ్నల వర్షం
డ్రగ్స్ సప్లయర్లతో సంబంధం లేదన్న రోహిత్‌రెడ్డి!
వాట్సాప్ కాల్స్ డేటా, నగదు లావాదేవీలు..ముందు పెట్టి ప్రశ్నించిన సిట్ అధికారులు
ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/శంషాబాద్ రూరల్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫాంహౌస్‌లో కాల్పులు, డ్రగ్స్ కేసుకు సంబంధించి నిందితుల నుంచి సిట్ అధికారులు మరింత కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ఇందులో భాగంగా. డ్రగ్స్ లింకులకు సంబంధించి మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితులు రోహిత్‌రెడ్డితోపాటు రితీశ్‌రెడ్డి, నమిత్ శర్మను సిట్ అధికారులు బుధవారం రెండో రోజు కస్టడీకి తీసుకుని శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుల తరఫు న్యాయవాది సమక్షంలో విచారణ జరిపారు. ఎక్కువసేపు నిందితులను అద్దాలు ఉన్న గదిలో ఉంచి న్యాయవాదికి కనిపించేలా విచారించారు. కాల్పులకు దారితీసిన పరిస్థితులపై సమాచారం రాబట్టేందుకు ఎక్కువ ప్రశ్నలు సంధించారు. గన్‌ఫైర్ చేసిన అనుభవం ఉందా? ఇంతకుముందు ఎక్కడైనా గన్ వినియోగించారా? గతంలో నేరచరిత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో నమిత్‌శర్మను విచారించారు. ఉదయం.. కస్టడీలో ఉన్న నిందితులను, స్టేషన్ బెయిల్‌పై ఉన్న నిందితులను వేర్వేరుగా విచారించగా, మధ్యాహ్నం.. పరస్పర విరుద్ధమైన సమాచారం ఇచ్చినవారిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించారు.
సంబంధంలేదన్న రోహిత్ రెడ్డి..!
డ్రగ్స్ సప్లయర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని రోహిత్‌రెడ్డి పలుమార్లు విచారణాధికారుల మందు వాదింనట్లు తెలిసింది. అయితే వారు.. వాట్సాప్ కాల్స్, నగదు బదిలీలకు సంబంధించిన లావాదేవీలను ముందుంచడంతో ఆయన మౌనం వహించినట్లు సమాచారం. కాల్పులు జరపాల్సిందిగా తాను ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదని ఈ సందర్భంగా రోహిత్‌రెడి, ఆయన సోదరుడు రితీశ్‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది. తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి నమిత్‌శర్మ గన్‌ఫైర్ చేశాడని వారిద్దరూ చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే రోహిత్‌రెడ్డి, నమిత్‌శర్మ, రితీశ్‌రెడ్డిల రెండు రోజుల పోలీసు కస్టడీ బుధవారంతో ముగిసింది. అయితే నిందితుల నుంచి మరింత సమాచారం రాబాట్టాల్సిన అవసరం ఉందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీంతో కస్టడీ పొడిగింపు కోసం మళ్లీ కోర్టును ఆశ్రయించే విషయంపై సిట్ అధికారులు బుధవారం రాత్రి చర్చించారు. ఈ మేరకు గురువారం కోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించారు. కాగా, నిందితుల విచారణ మొత్తం అత్యంత గోప్యంగా సాగుతోంది. బుధవారం విచారణ జరిగిన ప్రాంతం సమీపంలోకి ఎవరినీ రానివ్వలేదు. మీడియాను సైతం దూరంగా పెట్టారు. విచారణాధికారులు ఎవరూ నోరు మెదపడం లేదు. తొలి రోజు కస్టడీ సమాచారం మీడియాతో పంచుకున్న నిందితుల తరఫు లాయర్లు కూడా బుధవారం దాటవేశారు. ఇక ఈ కేసులో కీలకమైన డ్రగ్స్ సప్లయర్ అభిషేక్ సింగ్ ఎక్కడున్నాడన్నది ఇంకా తెలియడం లేదు. అతణ్ని అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు ప్రచారంలో ఉండగా.. పోలీసులు మాత్రం అతని కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు.