రాంచందర్‌రావు అరెస్టు
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:56 AM
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణం.. బాన్సువాడలో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చెలరేగిన నేపథ్యంలో ఆదివారం చలో కామారెడ్డి, బాన్సువాడకు బీజేపీ పిలుపునిచ్చింది.
ఇంటి వద్దే ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈటల, ఏలేటి గృహ నిర్బంధం
కాంగ్రెస్, మజ్లిస్‌పై రాంచందర్‌రావు ఆగ్రహం
అసద్ చెప్పుచేతల్లో సర్కారు ఉందని విమర్శ
బాన్సువాడలో హిందువుల ఇళ్లపై రాళ్ల దాడులు అత్యంత అమానుషమని వ్యాఖ్య
అవినీతిపై చర్చకు సిద్ధమని కాటిపల్లి సవాల్
కామారెడ్డిలో కొనసాగుతున్న ఉద్రిక్తత
హైదరాబాద్/తార్నాక/కామారెడ్డి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణం.. బాన్సువాడలో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చెలరేగిన నేపథ్యంలో ఆదివారం చలో కామారెడ్డి, బాన్సువాడకు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు యత్నించిన పలువురు పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మరి కొందరిని గృహ నిర్బంధం చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డితో పాటు బాన్సువాడలో పలు కుటుంబాలను పరామర్శించేందుకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును తార్నాకలోని నివాసం వద్ద పోలీసులు అరెస్టు చేసి బొల్లారం ఠాణాకు తరలించారు. దీంతో ఆయన్ను విడుదల చేయాలని బీజేపీ కార్యకర్తలు పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేశారు. మరోవైపు, కామారెడ్డికి బయలుదేరిన ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ మల్క కొమరయ్యలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు మురళీధర్ గౌడ్ పోలీసుల కన్నుగప్పి కామారెడ్డికి రావడంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. బాన్సువాడ వెళుతున్న మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ బీబీ పాటిల్‌ను మార్గమధ్యలోనే పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బొల్లారం పోలీసు స్టేషన్‌లో రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చెప్పుచేతల్లో సర్కారు కొనసాగుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం చేతిలో బందీగా మారిందని విమర్శించారు. పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేయడం, ముందస్తుగా గృహ నిర్బంధం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బాన్సువాడలో హిందువుల ఇళ్లపై జరిగిన రాళ్ల దాడి అత్యంత అమానుషమని అన్నారు. బాన్సువాడలో ఒక్క ఎంఐఎం కార్యకర్తను కూడా అరెస్టు చేయని పోలీసులు80మంది బీజేపీ, హిందూ సంఘాల కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. హిందూ సంఘాలపై, తమ పార్టీ కార్యకర్తలపై నమోదు చేసిన తప్పుడు కేసులను సహించబోమని తేల్చిచెప్పారు. తాను బాన్సువాడ వెళ్లి తీరతానని, బాధితులను పరామర్శిస్తానని చెప్పారు. ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు నిష్పక్షపాతంగా, నిబద్ధతతో పనిచేయాలి తప్ప, కాంగ్రెస్ నేతల చేతుల్లో తోలుబొమ్మలా వ్యవహరించవద్దని సూచించారు. కాగా, రాంచందర్‌రావు అరెస్టును నిరసిస్తూ బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు తార్నాక చౌరాస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
అక్రమాలను ప్రశ్నిస్తే దాడులా?: సంజయ్
కాంగ్రెస్ అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోందా..?అని నిలదీశారు. కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్సే అని స్పష్టం చేశారు. బాన్సువాడలో రాళ్లదాడికి పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. బాన్సువాడ బయలుదేరిన రాంచందర్‌రావును అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. పార్టీ హైకమాండ్‌కు కప్పం చెల్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. అప్పు మొత్తాన్ని కాంట్రాక్టర్లకు చెల్లించి, వారిచ్చే కమీషన్లను హైకమాండ్‌కు పంపించేందుకు మంత్రులు సన్నద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనతో పాటు పార్టీ ముఖ్య నాయకులను రెండు రోజులుగా హౌస్ అరెస్టు చేయడం రేవంత్ సర్కార్ నిర్బంధకాండకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం ఆరంభమైందని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. రేవంత్ సీఎం అయ్యాక హిందువులపై దాడులు పెరిగిపోయాయని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. తమ పార్టీ నాయకులను నిర్బంధించడం, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేయడం హేయమైన చర్య అని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. బాన్సువాడ ఘటనపై డీజీపీ విచారణ జరపాలని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ విజ్ఞప్తి చేశారు.
కామారెడ్డిలో చల్లారని వేడి..
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ మధ్య వివాదం సద్దుమణగలేదు. బాన్సువాడలో హింసాత్మక ఘటనలు, అదేవిధంగా శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఇంటి ముట్టడిని నిరసిస్తూ ఆదివారం చలో కామారెడ్డి, బాన్సువాడకు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో ఆ రెండు పట్టణాల్లో హై అలర్ట్ కొనసాగింది. కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ఇంటి వద్ద, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా తనపై చేసిన అవినీతి ఆరోపణలను సోమవారం కలెక్టరేట్‌లో అధికారుల సమక్షంలో ఆధారాలతో నిరూపించాలని కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే సవాల్‌ను స్వీకరించిన కాంగ్రెస్ నేతలు ఆయన అవినీతి, అక్రమాలపై ఆధారాలతో వస్తామని ప్రకటించారు. దీంతో సోమవారం మళ్లీ ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది.