ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపం
ABN , Publish Date - May 29 , 2026 | 04:04 AM
ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు.
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
తరుగు పేరిట రైతులకు తీవ్ర నష్టం
విచ్ఛిన్నకర శక్తులకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్దతు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఫైర్
చింతపల్లి/శంకర్‌పల్లి/హైదరాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి): ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటామన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారిని రోడ్డున పడేసిందని విమర్శించారు. ‘రైతు గోస..బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా గురువారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాంచందర్‌రావు పరిఽశీలించి రైతులతో మాట్లాడారు. తరుగు పేరిట బస్తాకు 3 నుంచి 5 కిలోల వరకు కోతపెడుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో కలిసి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. రైతులకు బీజేపీ అండగా ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాటం చేస్తుందని చెప్పారు. కాగా, మహిళల హక్కుల కోసమే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు చేయాలని కేంద్రం నిర్ణయించిందని రాంచందర్‌రావు చెప్పారు. యూసీసీ ఒక కులానికో, మతానికో వ్యతిరేకం కాదని.. దానిద్వారా మహిళలకు, చిన్న పిల్లలకు చట్టబద్ధమైన ఆస్తి హక్కులు లభిస్తాయని వివరించారు. గుజరాత్, ఉత్తరాఖండ్, గోవా, అసోం రాష్ట్ర్లాలు ఇప్పటికే యూసీసీ చట్టాన్ని అమలు చేశాయని.. తెలంగాణలోనూ అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. రంగారెడ్డి ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్సులో నిర్వహించిన పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జిల్లా ప్రశిక్షణ శిబిరంలో రాంచందర్‌రావు మాట్లాడారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్) ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. విచ్ఛిన్నకర శక్తులకు మద్దతు ఇస్తున్నాయని ఆరోపించారు.