Share News

కాంగ్రెస్‌ మహిళా వ్యతిరేకపార్టీ

ABN , Publish Date - Aug 29 , 2026 | 04:55 AM

కాంగ్రెస్‌, ఇండియా కూటమి మహిళా వ్యతిరేక పార్టీలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపడ్డారు. చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం దక్కకుండా అడ్డంకులు సృష్టించాయని ఆరోపించారు.

కాంగ్రెస్‌ మహిళా వ్యతిరేకపార్టీ

  • డీలిమిటేషన్‌ను అడ్డుకుంటున్న ఖర్గే, రాహుల్‌, రేవంత్‌: రాంచందర్‌రావు

  • సింగరేణికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తీరని ద్రోహం : ఎస్‌. కుమార్‌

హైదరాబాద్‌/తార్నాక, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌, ఇండియా కూటమి మహిళా వ్యతిరేక పార్టీలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపడ్డారు. చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం దక్కకుండా అడ్డంకులు సృష్టించాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌ గాంధీతో పాటు సీఎం రేవంత్‌ రెడ్డిలు నియోజకవర్గ పునర్విభజనను అడ్డుకుంటూ చట్టసభల్లో సీట్లు పెరగకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌ జరిగితేనే ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందన్నారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. ‘నీకు నేను రక్ష.. నాకు మీరు రక్ష.. మనమిద్దరం కలిసి ఈ దేశానికి రక్ష’ అనే భావనే ఈ పండుగలోని అసలైన పరమార్థమని పేర్కొన్నారు. మోదీ ప్రవేశపెట్టిన ‘పీఎం ఉజ్వల’, ‘ప్రధానమంత్రి మాతృ వందన యోజన’ పథకాలు కోట్లాది మంది మహిళలకు ఆర్థిక, ఆరోగ్య భరోసానిచ్చాయ ని తెలిపారు. కానీ, రాహుల్‌ గాంధీ మాత్రం అంతర్జాతీయ వేదికలపై ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని మెలోనీని కలిసిన గౌరవపూర్వక ఘట్టాన్ని వక్రీకరిస్తూ ఓ మహిళా ప్రధానిని అవమానించేలా ప్రవర్తించడం.. ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. సింగరేణి సంస్థను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దోపిడీకి అడ్డాగా మారిస్తే, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌ ఆరోపించారు. మోదీ ప్రభు త్వ సహకారంతో సింగరేణికి రూ. 2లక్షల కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కృషితో ఒడిశాలోని నైనీ కోల్‌ బ్లాక్‌కు అటవీ, పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరయ్యాయని, తాడిచర్ల, కోయగూడెం బ్లాకులను సింగరేణికి కేటాయించారని వివరించారు. కార్యక్రమంలో హరియాణ మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


హైదరాబాద్‌ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

హైదరాబాద్‌ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని రాంచందర్‌ రావు అన్నారు. వచ్చే జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ ఎన్నికల్లో పార్టీని భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. మాదాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ తార్నాక డివిజన్‌కు చెందిన పలువురు స్థానికులు, విద్యావంతులు బీజేపీలో చేరారు.

Updated Date - Aug 29 , 2026 | 04:56 AM