నిరుద్యోగ భృతి ఊసెత్తని ప్రభుత్వం
ABN , Publish Date - Aug 09 , 2026 | 06:07 AM
నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు. ‘జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపడతామని..
యువతకిచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.. ఉద్యోగావకాశాల కోసం వచ్చినవారిపై లాఠీచార్జీయా?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు. ‘జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపడతామని, ప్రతి నెలా నిరుద్యోగ భృతితో పాటు యువతకు అన్ని విధాలా అండగా ఉంటామని గొప్పలు చెప్పింది. కానీ రెండేళ్లు గడిచినా నేటికీ తెలంగాణ యువత ఉద్యోగాల కోసం రోడ్లపైనే నిరీక్షించాల్సి రావడం శోచనీయ’మని ఆయన పేర్కొన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో హైడ్రా ఉద్యోగాల కోసం తరలివచ్చిన నిరుద్యోగ యువతపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో యువత కోసం మొసలి కన్నీరు కారుస్తుంది.. తెలంగాణలో మాత్రం ఉపాధి కోసం వచ్చిన అమాయక నిరుద్యోగ యువతపైకి పోలీసులను ప్రయోగిస్తోంది. కాంగ్రెస్ చెప్పే ‘మొహబ్బత్ కీ దుకాణ్’ అంటే ఇదేనా?’ అని ఆయన నిలదీశారు. ప్రభుత్వం రూ.4,000 నిరుద్యోగ భృతి ఊసెత్తడం లేదని, యువత స్వయం ఉపాధికి రూ.10 లక్షల వరకు ఇస్తామన్న వడ్డీ లేని రుణాలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఆర్నెలల్లోనే ఇస్తామన్న జాబ్ క్యాలెండర్, లక్షలాది ఉద్యోగాల హామీలు కాంగ్రెస్ మార్క్ మోసానికి నిదర్శనంగా మిగిలిపోయాయన్నారు. ‘హైడ్రాలో కేవలం 150 ఉద్యోగ ఖాళీల ప్రకటన రాగానే వేలాది మంది నిరుద్యోగులు సరూర్ నగర్ స్టేడియానికి పరుగులు తీశారు.
అక్కడ కనిపించిన దృశ్యం కేవలం అభ్యర్థుల సమూహం కాదు.. ఉపాధి దొరక్క కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల తెలంగాణ యువత అనుభవిస్తున్న నైరాశ్యానికి, ఆవేదనకు అది సజీవ సాక్ష్యం. తమ భవిష్యత్తు కోసం, ఉద్యోగ అవకాశాల కోసం వచ్చే అమాయక యువతపై పోలీసు బలగాలను, లాఠీలను ఎందుకు ఉపయోగిస్తోందో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల’ని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. కాగా, ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలను తక్షణం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. పాలకులు గిరిజనుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని, వెంటనే ఆచరణయోగ్యమైన విధానాలు అవలంబించకపోతే గిరిజన ప్రాంతాల్లో ఆందోళనలు తప్పవని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు హెచ్చరించారు. అంతర్జాతీయ ఆదివాసీ గిరిజన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో గిరిజనుల హక్కుల పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్ త్యాగాలను, రక్తసిక్తమైన గిరిజన ఉద్యమాల చరిత్రను పాలకులు పునరావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.