తలసరి ఆదాయం తక్కువ ఉంటే ‘కొడంగల్’ రద్దు చేస్తారా..?
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:22 AM
డీలిమిటేషన్‌కు తలసరి ఆదాయమే ప్రామాణికమైతే అత్యల్ప తలసరి ఆదాయం గల కొడంగల్ అసెంబ్లీ స్థానాన్ని రద్దు చేస్తారా? అని సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ప్రశ్నించారు.
ఓటమి భయంతోనే సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం
డీ లిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు వేర్వేరు
నెహ్రూ వారసురాలిగానే ప్రధాని ఇందిర.. మహిళగా కాదు
సీఎం రేవంత్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): డీలిమిటేషన్‌కు తలసరి ఆదాయమే ప్రామాణికమైతే అత్యల్ప తలసరి ఆదాయం గల కొడంగల్ అసెంబ్లీ స్థానాన్ని రద్దు చేస్తారా? అని సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ప్రశ్నించారు. ఎక్కువ తలసరి ఆదాయం గల హైదరాబాద్‌లో సీట్లు పెంచుకుని తక్కువ గల ప్రాంతాలను పక్కన బెడతారా? అని నిలదీశారు. అసలు ఈ ప్రతిపాదనకు లాజిక్ ఏమిటని మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. ఢిల్లీ, హిమాచల్ వంటి చిన్న రాష్ట్రాలకు ఎలా అన్యాయం జరుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘లోక్‌సభలో ఇప్పుడు ఉన్న 543 ఎంపీ సీట్లలోనే కాంగ్రెస్ అరకొరగా గెలుస్తోంది. ఇక సీట్లు పెరిగితే తమ బతుకులేమవుతాయోనన్న భయంతోనే డీలిమిటేషన్‌పై రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని ఆయన ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే దక్షిణాది, ఉత్తరాది అంటూ సీఎం రేవంత్ మాట్లాడుతున్నారన్న రాంచందర్‌రావు.. దక్షిణాదికి ఆన్యాయం చేసిందే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. గతంలో జరిగిన డీలిమిటేషన్‌లో జనాభా తక్కువ గల తమిళనాడుకు 39 సీట్లు ఉంటే, అధిక జనాభా గల కర్ణాటకకు 28 సీట్లేనని, దీనికేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపడతారని, దీనికి మహిళా రిజర్వేషన్‌తో సంబంధమే లేదని స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ను అడుగడుగునా కాంగ్రెస్ పార్టీయే అవమానించిందన్న రాంచందర్‌రావు.. ఆయన రచించిన రాజ్యాంగం పుస్తకం చేతిలో పట్టుకుని తిరగడం కాదని, గుండెల్లో దాచుకోవాలని రాహుల్‌గాంధీకి సూచించారు. ‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దుచేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పీచ్‌ను సీఎం రేవంత్, మార్పింగ్ చేసి గత ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆయనపై మార్పింగ్ కేసు ఇప్పటికీ ఉంది’ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మహిళను నియమించుకున్నామన్న సీఎం రేవంత్ వ్యాఖ్యపై తీవ్రంగా స్పందించిన రాంచందర్‌రావు.. మహిళ/ పురుషుడు అధ్యక్షుడైనా తమకు సంబంధం లేదని అసలు కాంగ్రెస్సే కుటుంబ పార్టీ అని పేర్కొన్నారు. నెహ్రూ వారసురాలిగా మాత్రమే ఇందిర ప్రధాని అయ్యారు తప్ప ఒక మహిళగా కాదన్నారు. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. తనకు ఇటలీ భాష వచ్చి ఉంటే ఆ భాషలోనే కాంగ్రెస్ అగ్రనేత సోనియాకు చెప్పి ఉండేవాడినని ఎద్దేవా చేశారు. ‘కానీ, నాకు ఇటలీ భాష రాదు. అయినా తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అంటారు. అందుకే తెలుగులోనే చెబుతున్నా. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ వేర్వేరు అంశాలు. ఇది రాహుల్ గాంధీ చేసిన ప్రకటన’ అని గుర్తు చశారు.
లక్ష్మణ్ సరే సింఘ్వీ, జైరాం రమేశ్ ఎక్కడి వారు?
‘యూపీ నుంచి మా పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్ రాజ్యసభకు ఎన్నిక కావడాన్ని గర్విస్తున్నాం. తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లిన అభిషేక్ సింఘ్వీ ఎక్కడి వ్యక్తి? గతంలో జైరాం రమేశ్‌ను ఇక్కడకు తేలేదా? దేశమంతా ఒక్కటేనని భావించే వాళ్లం.. ఇదే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్లగానే దక్షిణాది, ఉత్తరాది అంటూ మాట్లాడటమేమిటి?’ అని రాంచందర్‌రావు నిలదీశారు. ఇందిర తన క్యాబినెట్‌లో ఉన్న సుశీలా నయ్యర్‌ను ఉన్నఫళంగా తొలగించారన్నారు.