మాది కాదు.. రేవంత్ రెడ్డిదే గులాంగిరీ
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:22 AM
ఢిల్లీకి గులాంగిరీ చేస్తోంది తాము కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిని నిలుపుకోవడం కోసం ఇటలీ నుంచి వచ్చిన సోనియా కుటుంబానికి నెలనెలా ముడుపులు చెల్లిస్తూ ....
సీఎం పదవిని కాపాడుకోవడానికి సోనియా కుటుంబానికి ముడుపులు చెల్లిస్తున్నారు
రేవంత్‌కు నోరుందని బీజేపీ నాయకులపై ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదు
6 హామీలు అమలు చేయకుండా తిరగలేరు
ధాన్యం కొనేది కేంద్రం.. రాష్ట్రం చేసేది సేకరణే
సీఎంకు ఫస్ట్ ఏటీఎంగా పాలమూరు-రంగారెడ్డి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
యాదాద్రి, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీకి గులాంగిరీ చేస్తోంది తాము కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిని నిలుపుకోవడం కోసం ఇటలీ నుంచి వచ్చిన సోనియా కుటుంబానికి నెలనెలా ముడుపులు చెల్లిస్తూ గులాంగా మారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు. రేవంత్ రెడ్డికి నోరుందని బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌పై ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి మూసీ ప్రక్షాళన రెండో ఏటీఎం అయితే, పాలమూరు-రంగారెడ్డి మొదటి ఏటీఎంగా మారిందన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని సురేంద్రపురి ఆర్యవైశ్య సత్రంలో జిల్లా బీజేపీ జిల్లాస్థాయి ప్రశిక్షణ మహాభియాన్‌ను రాంచందర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, ఈ ముసుగులో లక్షల కోట్ల అంచనాలతో జరిగే అక్రమ కూల్చివేతలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. బీజేపీ రాష్ట్రానికి ఏమి చేసిందని మాట్లాడుతున్నారని, రేవంత్‌రెడ్డి కళ్లకు గంతలు కట్టుకున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షల కోట్లతో జాతీయ రహదారులు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ములుగు సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్, వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ వంటిని తెచ్చింది ఎవరని ప్రశ్నించారు. ఎంఎంటీఎ్‌సకు పూర్తిగా కేంద్రమే నిధులు సమకూరుస్తోందని, రీజినల్ రింగ్ రోడ్డుకు (ఆర్‌ఆర్‌ఆర్) భూసేకరణ చేయలేక కేంద్రంపై నిందలు వేయడం సరికాదని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.2,500 కోట్లు కేటాయింపులు జరిపిందని చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు రూ.2 వేల కోట్ల రుణం సైతం కేంద్రమే మంజూరు చేసిందన్నారు. మెట్రో విస్తరణకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు కేంద్రమే చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం సేకరణకే పరిమితమని, వాటికి రీ-ఇన్వెస్ట్ చేస్తున్నది కేంద్రమేనని చెప్పారు. ధాన్యం దిగుబడి అంచనా వేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందని విమర్శించారు. 50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇండెంట్ ఇచ్చినా, ఇప్పటికే 55.90 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసిందన్నారు. అసలు రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమిటని ప్రశ్నించారు.