కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు
ABN , Publish Date - Apr 26 , 2026 | 05:03 AM
రాష్ట్రంలో ఎన్ని పార్టీలు వచ్చినా బీజేపీకి ఇబ్బంది లేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు.
ఎన్ని పార్టీలు వచ్చినా బీజేపీకి ఇబ్బంది లేదు: రాంచందర్ రావు
హైదరాబాద్, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్ని పార్టీలు వచ్చినా బీజేపీకి ఇబ్బంది లేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. కల్వకుంట్ల కవిత ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేనపై ఆయన.. స్పందిస్తూ.. కోదండరాం, కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారని వ్యాఖ్యానించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన జిల్లాస్థాయి నాయకుల శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడుతూ.. ఎవరు పార్టీ ఏర్పాటు చేసినా, ప్రజల గురించి ఏ పార్టీ ఆలోచిస్తుందన్నది ముఖ్యమని అన్నారు. ‘గతంలో టీఆర్‌ఎస్.. ఇప్పుడు బీఆర్‌ఎస్.. ఈ పార్టీకి పుట్టబోయే బిడ్డ పేరు కూడా టీఆర్‌ఎస్ అట.. ! వీరంతా కూడా రాష్ట్రాన్ని దోచుకోవడమే తప్ప చేస్తున్నదేమిటి?’ అని ప్రశ్నించారు. రిటైర్డు ఉద్యోగుల బకాయిలను మంత్రుల వేతనం నుంచి ఎన్నాళ్లు ఇస్తారని, మీరు దోచుకున్నమొత్తాన్ని ఇస్తే చాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణాలో కేసీఆర్‌ది పిట్టలదొర పాత్ర అయితే, కల్వకుంట్ల కవితది పిట్టల దొరసాని పాత్ర అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. నిజామాబాద్‌లో ఆమెకు రాజకీయ సమాధి కట్టిందే బీజేపీ అని పేర్కొన్నారు.