Share News

మోదీ సూచనలపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం: రాంచందర్‌రావు

ABN , Publish Date - May 13 , 2026 | 04:31 AM

తెలంగాణ పర్యటనలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ చేసిన సూచనలపై కాంగ్రెస్‌ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు మండిపడ్డారు.

మోదీ సూచనలపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం: రాంచందర్‌రావు

హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పర్యటనలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ చేసిన సూచనలపై కాంగ్రెస్‌ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు మండిపడ్డారు. దేశ ప్రయోజనాలు, ఆర్థిక క్రమశిక్షణ, స్వావలంబన, దేశ భవిష్యత్తు దృష్ట్యా ప్రధాని చేసిన సూచనలను రాజకీయ కోణంలో చూడడం దురదృష్టకరమన అన్నారు. ప్రధానిని విమర్శిస్తున్న కాంగ్రెస్‌ నేతలు.. గత చరిత్రను గుర్తు చేసుకోవాలని సూచించారు. ‘ప్రజలు బియ్యం, రొట్టెల వినియోగం తగ్గించుకోవాలని, వారానికి ఒకసారి ఉపవాసం ఉండాలని నాటి ప్రధాని నెహ్రూ పిలుపునివ్వగా.. ప్రతి సోమవారం భోజనం మానేయాలని లాల్‌బహదూర్‌ శాస్త్రి సూచించారు. 1967లో బంగారం కొనొద్దని నాటి ప్రధాని ఇందిర పిలుపునిచ్చారు. 1976లో బలవంతపు కుటుంబ నియంత్రణ చేపట్టారు. సబ్సిడీలను తగ్గించాలని మన్మోహన్‌ సూచించారు. 2013లో అప్పటి కేంద్ర మంత్రి పి.చిదంబరం కూడా బంగారం కొనొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు’’ అని గుర్తు చేశారు. అప్పుడు కాంగ్రెస్‌ నేతలు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ప్రధాని మోదీ సూచనలు బలవంతపు ఆంక్షలు కావని, దేశ ప్రయోజనాల కోసం ప్రజలు స్వచ్ఛందంగా పాటించాల్సినవి మాత్రమేనని తెలిపారు. దేశం కోసం మంచి విషయాలు మాట్లాడినప్పుడు రాజకీయాలకతీతంగా అందరూ సహకరించాలని కోరారు. ‘‘నేషన్‌ ఫస్ట్‌’’ సిద్ధాంతంతో బీజేపీ పని చేస్తుండగా, ‘‘పవర్‌ ఫస్ట్‌’’ నినాదంతో కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

Updated Date - May 13 , 2026 | 04:31 AM