కాంగ్రెస్‌ది రజాకార్ల పాలన
ABN , Publish Date - Jun 08 , 2026 | 05:57 AM
కాంగ్రెస్ ప్రభుత్వం రజాకార్ల తరహా పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు రజాకార్లతో ఎలా కొట్లాడారో కాంగ్రెస్‌తో..
గ్రామాలకెళితే ఆ పార్టీ నాయకులనే ప్రజలు సరిహద్దులు దాటనివ్వరు
మేం తల్చుకుంటే కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేరు
కేంద్ర మంత్రులపై మాట్లాడే ముందు సీఎం రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, జూన్ 7(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం రజాకార్ల తరహా పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు రజాకార్లతో ఎలా కొట్లాడారో కాంగ్రెస్‌తో కూడా అలాగే కొట్లాడతారని హెచ్చరించారు. మజ్లిస్‌తో సహవాసం వల్ల కాంగ్రెస్‌కు ‘రానివ్వం.. చేయనివ్వం..’ అనే నిజాం తరహా భాష అలవాటైందని విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు ఇవ్వకపోతే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పొలిమేర దాటబోరని సీఎం రేవంత్ చేసిన ప్రకటనపై రాంచందర్‌రావు తీవ్రస్థాయిలో స్పందించారు. సీఎం స్థాయిలో ఉన్న నాయకుడు అలాంటి భాష మాట్లాడకూదంటూ, ఆ మాట అనడానికి ఆయనెవరని ప్రశ్నించారు. ‘ఒకవైపు మీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు విచ్చలవిడిగా జరుగుంటే.. మరోవైపు మీ పార్టీ నాయకులు గ్రామాల్లో పేదలపై అక్రమ కేసులు పెడుతున్నారు. వారి భూములు లాక్కుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటే.. కేంద్రం ఏమిచ్చింది? కేంద్ర మంత్రులను పొలిమేర దాటనివ్వబోమని మాట్లాడతారా? గ్రామాలకు వెళితే మిమ్మల్నే సరిహద్దులు దాటనివ్వరు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేర’ని హెచ్చరించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలను రాష్ట్ర ప్రజలు తరిమికొట్టడం ఖాయమన్నారు.
రైతు సంక్షేమం గురించి పదేపదే మాట్లాడే సీఎం రేవంత్.. కోహెడలో సమీకృత పళ్ల మార్కెట్ కోసం వారి నుంచే బలవంతంగా భూములు లాక్కున్నారని, వారికి పరిహారం ఇవ్వకుండానే మార్కెట్‌కు శంకుస్థాపన చేశారని ఆరోపించారు. సీఎం పర్యటన సందర్భంగా రైతులను పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం దురదృష్టకరమన్నారు. రైతులకు పరిహారం చెల్లించిన తర్వాతే మార్కెట్ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై, జిల్లాలకు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నిధులపై సెక్రటేరియట్ గేటు వద్ద బహిరంగ చర్చకు సిద్ధమ’ని సీఎం రేవంత్‌కు ఆయన సవాల్ చేశారు. గడచిన 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు రూ.13 లక్షల కోట్లు విడుదల చేసిందని పేర్కొంటూ, చిత్తశుద్ధి ఉంటే వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో ఎలాంటి ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్‌ది అవినీతి, కమీషన్ల పాలన. బీఆర్‌ఎస్ కూడా ఇలాగే చేస్తే ఆ పార్టీని రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపించారు. కాంగ్రెస్‌కు కూడా అదే గతి పట్టడం ఖాయమ’ని అన్నారు. కాగా, ఏబీవీపీ సభ్యత్వ నమోదును ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రావుల కృష్ణ ఆదివారం ప్రారంభించారు. 10లక్షల సభ్యత్వాలు లక్ష్యమని తెలిపారు. వర్క్ షాప్‌లో రాష్ట్రం నలుమూలల నుంచి 300 మంది ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈటలపై ఫ్లెక్సీలు.. రామకృష్ణ సస్పెన్షన్
ఎంపీ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఘటనలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జన్యవుల రామకృష్ణను బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సస్పెండ్ చేశారు. ఈటలకు వ్యతిరేకంగా రామకృష్ణతో పాటు మరో ఐదుగురు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రామకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.