బీఆర్‌ఎస్‌ను తేలును చంపినట్లు చెప్పుతో కొట్టి చంపాలి
ABN , Publish Date - May 25 , 2026 | 05:27 AM
తేలు ముందుకు వెళ్తూ.. వెనుక నుంచి విషంతో కాటు వేసినట్టుగానే బీఆర్‌ఎస్ పార్టీ విధానాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అన్నారు.
రాష్ట్రంలో ఆ పార్టీ పనైపోయింది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
ఖమ్మం కార్పొరేషన్/హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): తేలు ముందుకు వెళ్తూ.. వెనుక నుంచి విషంతో కాటు వేసినట్టుగానే బీఆర్‌ఎస్ పార్టీ విధానాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అన్నారు. తేలుని చెప్పుతో కొట్టి చంపినట్టుగానే బీఆర్‌ఎస్ పార్టీనీ కూడా చెప్పుతో కొట్టి చంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ పనైపోయిందని, కొన్ని మీడియా, సోషల్ మీడియాలకే ఆ పార్టీ పరిమితమైందని అన్నారు. ఖమ్మంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సారు.. కారు.. 16 అని ప్రచారం చేసుకున్న బీఆర్‌ఎస్.. ఎంపీతో పాటు ఎమ్మెల్సీలను కూడా గెలవలేకపోయిందని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ దగ్గరకు వంద సార్లు వెళ్లి నిధులు తెచ్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బయట మాత్రం కేంద్రం నిధులు ఇవ్వడం లేదని చెబుతున్నారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ కూడా ఇలానే వ్యవహరించారని, అందుకే ప్రజలు వారిని ఇంటికి పంపారని గుర్తు చేశారు. రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి రాబోతుందని పేర్కొన్నారు. ఇక, ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ఏం లాభం లేదని, రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని రాంచందర్‌రావు మండిపడ్డారు. ధాన్యం, మొక్కజొన్న ఇతర పంటల కొనుగోలు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతులకు బేడీలు వేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. రైతు ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి గోనే సంచులు, లారీలను కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని రాంచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
‘గోదావరి’లో ప్రాజెక్టులను పూర్తి చేయండి
గోదావరి బేసిన్‌లో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ను తక్షణం పూర్తి చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి రాంచందర్‌రావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణాకు 360 టీఎంసీల గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులిచ్చిందని పేర్కొన్నారు. ఇందులో కాళేశ్వరం- 237 టీఎంసీలు, సీతారామ - 67 టీఎంసీలు, సమ్మక్కసాగర్-47 టీఎంసీలు, చిన్న కాళేశ్వరం-4.5 టీఎంసీలు, మోదికుంటవాగు-2.1టీంఎసీలు, చనాకా-కొరాట 2టీఎంసీలు, గూడెం లిఫ్టు 3 టీంఎసీల ప్రాజెక్టులు ఉన్నాయని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలను సరిదిద్దడంపై ఎన్‌డీఎ్‌సఏ చేసిన సిఫారసులను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.