రామాయంపేటలో దంపతుల విజయం
ABN , Publish Date - Feb 14 , 2026 | 04:39 AM
మెదక్ జిల్లా రామాయంపేట మునిసిపాలిటీలో భార్యా, భర్తలు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున బరిలోకి దిగిన గజవాడ నాగరాజు, లావణ్య దంపతులు తమ వార్డుల్లో గెలుపొంది....
సంగారెడ్డిలో ఒకే ఇంటి నుంచి ముగ్గురి గెలుపు
రామాయంపేటూ/సంగారెడ్డిటౌన్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లా రామాయంపేట మునిసిపాలిటీలో భార్యా, భర్తలు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున బరిలోకి దిగిన గజవాడ నాగరాజు, లావణ్య దంపతులు తమ వార్డుల్లో గెలుపొంది మునిసిపాలిటీలో కీలకంగా మారారు. మొదటిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లావణ్య, తన తొలి ప్రయత్నంలోనే కౌన్సిలర్‌గా గెలిచారు. మహిళా రిజర్వేషన్ కలిసి రావడంతో చైర్మన్ పీఠం కూడా దక్కే అవకాశం ఉంది. గత ఐదేళ్లుగా కౌన్సిలర్‌గా ప్రజల్లో ఉన్న నాగరాజు, ఈసారి తనతో పాటు భార్యను కూడా గెలిపించుకోవడంలో సఫలమయ్యారు. మహిళా రిజర్వేషన్ కేటాయించడంతో, తన సతీమణిని ఒకటో వార్డు నుంచి పోటీకి దింపి, తాను కూడా మరో వార్డు నుంచి గెలిచి మునిసిపాలిటీపై పట్టు సాధించారు. నాగరాజుకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అండదండలు మెండుగా ఉండడంతో చైర్మన్‌గా అవకాశం దక్కడం లాంఛనంగా మారింది. మరోవైపు, సంగారెడ్డి మునిసిపాలిటీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. పట్టణంలోని 24వ వార్డు నుంచి ఉల్ఫాతి సుల్తానా, 25వ వార్డు నుంచి అయేషా సుల్తానా, 26వ వార్డు నుంచి షేక్ షఫీ అహ్మద్ పోటీ చేసి గెలుపొందారు.