ప్రజా సమస్యల ప్రస్తావన ఏది?
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:07 AM
గవర్నర్ ప్రసంగమంతా కాంగ్రెస్ సొంత డబ్బాలా ఉందని, ప్రజలను మభ్యపెట్టేలా ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ సొంత డబ్బాలా గవర్నర్ ప్రసంగం
ఇది ఎగవేతల డిక్లరేషన్: బీజేఎల్పీ నేత ఏలేటి
మజ్లిస్ నేతలు దేశాన్ని అవమానించారు: శంకర్
హైదరాబాద్, మార్చి 16(ఆంధ్రజ్యోతి): గవర్నర్ ప్రసంగమంతా కాంగ్రెస్ సొంత డబ్బాలా ఉందని, ప్రజలను మభ్యపెట్టేలా ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈ ప్రసంగం ఎగవేతల డిక్లరేషన్ అని ఎద్దేవా చేశారు. సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు గానీ, అప్పులు తీర్చే ప్రణాళికలు గానీ.. గవర్నర్ ప్రసంగంలో లేవని ధ్వజమెత్తారు. అదంతా ఒట్టి డొల్ల, సొల్లు పురాణం అని, ఇలాంటి ప్రసంగాలతో ప్రజలకు ఒరిగేదేమి ఉండదని అన్నారు. ‘‘విషయం తక్కువ.. విశేషణం ఎక్కువ. కంటెంట్ తక్కువ.. క్యాంపెయిన్ ఎక్కువ. పనులు తక్కువ.. ప్రచారం ఎక్కువ అన్నట్టుగా గవర్నర్ ప్రసంగం ఉంది’’ అని ఎద్దేవా చేశారు. వందేమాతరం ఆలాపన సందర్భంగా మజ్లిస్ నేతలు బయటికి వెళ్లిపోవడం.. దేశాన్ని, రాజ్యాంగాన్ని అవమానించడమేనని బీజేపీ నేత పాయల్ శంకర్ మండిపడ్డారు. మజ్లిస్ ఎమ్మెల్యేలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డీజీపీని కోరారు.
బీజేఎల్పీలో ఎమ్మెల్యే రాజాసింగ్
కొన్ని నెలల కిందట బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్... అనూహ్యంగా బీజేఎల్పీ చాంబర్‌లో ప్రత్యక్షమయ్యారు. సోమవారం సెంబ్లీ, వాయిదాపడిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బీజేఎల్పీకి చేరుకున్నారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం బీజేఎల్పీలోకి వెళ్లారు. అక్కడే ఉన్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పాయల్ శంకర్, మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజాసింగ్‌ను ఆప్యాయంగా పలకరించారు. ఇదే సమయంలో కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీఆర్‌ఎ్‌సఎల్పీ చాంబర్ నుంచి బయటకు వచ్చారు. బీజేఎల్పీలో రాజాసింగ్‌ను చూసిన కేటీఆర్... అన్నా సస్పెండయ్యారు కదా...: ఇక్కడున్నరు.. బయటకు రండి.. అంటూ నవ్వుతూ పలుకరించారు. రాజాసింగ్ స్పందించబోతుండగా... పాయల్ శంకర్ తదితరులు జోక్యం చేసుకుని, అన్నా.. మీరే మా చాంబర్‌లోకి రండి.. అంటూ ఆహ్వానించారు. సున్నితంగా తిరస్కరించిన కేటీఆర్.. తానొస్తే మీడియా వాళ్లు రకరకాలుగా వార్తలు రాస్తారంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. తాను వెళ్లేది పాత ఇంటికే (బీజేపీలోకి)నని రాజాసింగ్ మీడియాతో వ్యాఖ్యానించారు.