నా చావుకు ప్రధాని మోదీయే కారణం
ABN , Publish Date - Jul 24 , 2026 | 06:27 AM
‘తన చావుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే కారణం’’ అంటూ సర్ ఎన్యుమరేషన్ ఫారంపై సూసైడ్ నోట్ రాసి పిట్ల వంశీ(25) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
‘సర్’ ఫారంపై సూసైట్ నోట్ రాసి యువకుడి బలవన్మరణం
ఎల్లారెడ్డిపేట, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ‘తన చావుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే కారణం’’ అంటూ సర్ ఎన్యుమరేషన్ ఫారంపై సూసైడ్ నోట్ రాసి పిట్ల వంశీ(25) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గొల్లపలికి చెందిన పిట్ల బాలయ్య, భారతి దంపతుల ఏకైక కుమారుడు వంశీ కుటుంబ పరిస్థితుల వల్ల ఇంటర్మీడియట్ తర్వాత చదువు మానేశాడు. ఆరేళ్లుగా పెయింటింగ్ పనులు చేసుకుంటున్నాడు. ఎప్పట్లాగే బుధవారం కూడా పనికి వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన వంశీ.. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి రాత్రి నిద్రపోయాడు. తల్లిదండ్రులు తెల్లవారి లేచి చూసేసరికి వంశీ ఇంట్లోని దూలానికి ఉరి వేసుకొని కనిపించాడు. ‘ఇది నా యొక్క చావు లేఖ’ అంటూ సర్ ఫారంపై రాసి ఉన్న లేఖను ఘటనా స్థలంలో పోలీసులు గుర్తించారు. తన చావుకు ప్రధాని మోదీ కారణమని, కుటుంబ కాదని.. తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవద్దని, ఇట్లు భారతదేశ పౌరుడు, వంశీ రాయల్, జైహింద్ అని ఆ లేఖలో రాసి ఉంది. కాగా, ఢిల్లీలో విద్యార్థుల పట్ల జరుగుతున్న దమనకాండను చూసి ఆందోళనకు గురై వంశీ ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్‌ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు ఆరోపించారు.