Share News

రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లకు వర్షం ఆటంకం

ABN , Publish Date - Jun 28 , 2026 | 03:39 AM

ఈనెల 30న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురంలో 2లక్షల మంది రైతులతో ప్రతిష్ఠాత్మకంగా రైతు ఆశీర్వాదసభను నిర్వహించాలని....

రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లకు వర్షం ఆటంకం

  • ఖమ్మం జిల్లాలో మైదానమంతా బురదమయం

  • పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన అధికారులు

  • రైతుమేళా స్టాళ్ల ప్రారంభం రేపటికి వాయిదా

  • 30న యథాతథంగా సభ నిర్వహణకు నిర్ణయం

ఖమ్మం, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఈనెల 30న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురంలో 2లక్షల మంది రైతులతో ప్రతిష్ఠాత్మకంగా రైతు ఆశీర్వాదసభను నిర్వహించాలని, ఈ సభ ద్వారానే సీఎం రేవంత్‌రెడ్డి రైతుభరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ దిశగానే రెండు రోజులుగా యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. కానీ శుక్రవారం రాత్రి పడిన భారీవర్షం తీవ్ర ఆటంకం తెచ్చిపెట్టింది. సభా ప్రాంగణమంతా నల్లరేగడి పొలాలు కావడంతో జర్మన్‌ హ్యాంగర్‌ టెంట్ల ఏర్పాట్లకు, ఎగ్జిబిషన్‌ సామగ్రితో వచ్చిన లారీలు దిగబడ్డాయి. దీనికితోడు కాలు పెట్టిన చోట బురద తీవ్రంగా ఉండడంతో శనివారం ఏర్పాట్ల ప్రక్రియకు తీవ్ర అవరోధం ఏర్పడింది. వాస్తవానికి ఆశీర్వాద సభకు ముందు ఆది, సోమవారం రెండురోజులు 150 స్టాళ్లతో రైతుమేళా పేరుతో రైతు ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసి ఆదివారం ఉదయం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతులమీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ ఆ ఎగ్జిబిషన్‌ ప్రారంభం సోమవారానికి వాయిదా వేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్రమోహన్‌, ఖమ్మం కలెక్టర్‌ దివాకర, ఇతర అధికారులు సమావేశమై పరిస్థితి సమీక్షించారు. వర్షంతో తలెత్తిన ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి సమాచారం అందించారు. ఆ తర్వాతే రైతుమేళా ఎగ్జిబిషన్‌ను సోమవారానికి వాయిదా వేసి, 30న రైతు ఆశీర్వాద సభను ముందుగా నిర్ణయించిన ప్రకారం జగన్నాథపురంలోనే నిర్వహించాలని నిర్ణయించారు.

Updated Date - Jun 28 , 2026 | 03:39 AM