kumaram bheem asifabad- వర్షం లోటు.. సాగు తడబాటు
ABN , Publish Date - Jul 11 , 2026 | 10:51 PM
ఈ వానాకాలం సీజన్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో రైతాంగం సతమతమవుతోంది. ముఖ్యంగా జిల్లాలో భారీ వర్షాలు లేకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటకి ఆశించిన మేర వర్షాలు లేక జూన్ తీవ్రంగా నిరాశే మిగిల్చింది. ఈ నెల 5 వరకు కూడా అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో రైతులు దిగాలు పడుతున్నారు
రెబ్బెన, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఈ వానాకాలం సీజన్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో రైతాంగం సతమతమవుతోంది. ముఖ్యంగా జిల్లాలో భారీ వర్షాలు లేకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటకి ఆశించిన మేర వర్షాలు లేక జూన్ తీవ్రంగా నిరాశే మిగిల్చింది. ఈ నెల 5 వరకు కూడా అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో రైతులు దిగాలు పడుతున్నారు. జూన్ నెలలో రైతులు పనులు ప్రారంభించేందుకు అంతా సిద్ధంగా ఉన్నారు. కానీ భారీ వర్షాలు కురువక పోవడంతో రైతులంతా కూడా అయోమయ స్థితిలో ఉన్నారు. చిన్న పాటి వర్షాలకు పత్తిపంటకు సంబంధించిన విత్తనాలను వేశారు. కాని వరి విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ఒక వైపు రాత్రి వర్షం కురుస్తుండడం, మరో వైపు ఉదయం పూట ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో రైతులు ఏమీ చేయాలో తెలియక నిస్సాహాయ స్థితిలో ఉంటున్నారు.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లా వ్యాప్తంగా 4.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పత్తి పంటపై మొగ్గు చూపుతున్నారు. అలాగే కొన్ని చోట్ల కూడా వరినారుమళ్లు సిద్ధం చేస్తున్నారు. రానున్న రోజుల్లో విస్తారంగా కురుస్తాయన్న ఆశలో పనులు మందకొడిగా చేపడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఆరుతడి పంటలను సాగు చేయడం మేలని, ఒక వేళ వరి సాగు చేయాలనుకుంటే స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జూన్ 1 నుంచి జూలై 4 వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 243.3 మిల్లీమీటర్లుకు గానూ 225.6 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. వర్షం పాతం స్థాయి లోటుగానే నమోదు అయింది. జిల్లాలో ఎక్కడ కూడా ఆశించిన మేర వర్ష పాతం నమోదు కాలేదు. రైతు పంటలను పండించేందుకు ముందస్తుగానే తమ సెల్ ఫోన్‌లో యూరియాను బుక్ చేసుకుని తెచ్చుకున్నారు. వర్షాలు కురిస్తే రానున్న రోజుల్లో యూరియా కొరత ఉంటుందని భావించి అంతా సిద్దం చేసుకున్నారు వరుణుడు కరుణించక పోవడంతో ఇప్పుడు రైతులు టెన్షన్‌లో పడ్డారు. ఒక వైపు పనులు చేపడుదామంటే వర్షాలు లేకుంటే పంట నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఈ నెల 4 వరకు కురిసిన వర్షపాతాన్ని పరిశీలిస్తే జైనూరులో సాధారణం వర్షపాతం 292.8కు గానూ 243.7 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. సిర్పూరు(యు)లో 292.4కు గానూ 220.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లింగాపూర్‌లో 269.9కు 218.2, తిర్యాణిలో 239.4కు 196.8, రెబ్బెనలో 148.3కు 185.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆసిఫాబాద్‌లో 253.1కు 217, కెరమెరిలో 318.7కు 205.7, వాంకిడిలో 224.9, 233.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగజ్‌నగర్‌లో 133.9, 204.4, సిర్పూరు(టి)లో 309.2కు, 228.5, కౌటాలలో 343.5కు, 250.6, చింతలమానేపల్లిలో 303.4కు, 245.2 మిల్లీమీటర్లు కురిసింది. బెజ్జూరులో 155లో 257.4, పెంచికల్‌పేటలో 185.8కు 231.7, దహెగాంలో 172.7కు 244.9 మిల్లీమీటర్ల వర్షం పాతం నమోదు అయింది.