Share News

ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో..మణుగూరు-రామగుండం రైల్వేలైన్‌

ABN , Publish Date - May 21 , 2026 | 03:22 AM

రాష్ట్రంలో మరో కొత్త రైలు మార్గం త్వరలోనే అందుబాటులోకి రానుంది. భారతీయ రైల్వే ఇటీవల ప్రకటించిన మణుగూరు-రామగుండం రైల్వేలైన్‌ను పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్య...

ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో..మణుగూరు-రామగుండం రైల్వేలైన్‌

  • రూ.5,818 కోట్లతో నిర్మాణానికి రైల్వేబోర్డు పచ్చజెండా

  • భూసేకరణ సహా ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయం

  • రాష్ట్రంలో గిరిజన, పర్యాటక ప్రాంతాల మీదుగా రైలు సదుపాయం

  • విజయవాడ-నాగపూర్‌ సెక్షన్‌కు ప్రత్యామ్నాయం అవుతుందన్న అధికా రులు

హైదరాబాద్‌ సిటీ, మే20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో కొత్త రైలు మార్గం త్వరలోనే అందుబాటులోకి రానుంది. భారతీయ రైల్వే ఇటీవల ప్రకటించిన మణుగూరు-రామగుండం రైల్వేలైన్‌ను పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిన నిర్మించేందుకు రైల్వేబోర్డు తాజాగా పచ్చజెండా ఊపింది. ఈ మార్గం నిర్మాణానికి రూ.5,818.45 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 207.8 కిలోమీటర్ల ఈ బ్రాడ్‌గేజ్‌ లైన్‌, రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు, సింగరేణి బొగ్గుగనుల నుంచి వచ్చే సరుకు రవాణా ఆదాయాన్ని కూడా పెంచుతుందని రైల్వే ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా బొగ్గు, కోక్‌, ఎరువులు, ఆహార ధాన్యాలు, పిండి, పప్పుధాన్యాలు, సిమెంట్‌, ఖనిజాలు, ఇతర ధాతువుల రవాణాకు ఈ మార్గం కీలకం కానుందని అంచనా వేస్తున్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోపాలరావుపేట, ములుగు జిల్లాలోని తాడ్వాయి, మేడారం.. పెద్దపల్లి జిల్లాలోని భూపాలపల్లి, మంథని మీదుగా అనేక గిరిజన గ్రామాలను, పర్యాటక ప్రదేశాలను కలిపేలా ఈ రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌ను రూపొందించారు.

ఏడాదిలో భూసేకరణ.. ఐదేళ్లలో నిర్మాణం!

భూేసకరణకు ఒక సంవత్సరం, నిర్మాణానికి నాలుగు సంవత్సరాలతో సహా, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఐదు సంవత్సరాల కాలపరిమితిని నిర్దేశించింది. భూేసకరణ, ఇతర అనుమతులు, సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయడం వంటి పనులను రైల్వేశాఖ నిర్వహిస్తుంది. రైల్వే మార్గం నిర్మాణం, ఫైనాన్సింగ్‌, 45 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగిస్తారు. కేంద్ర ఆర్థిక శాఖలోని పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ అప్రైజల్‌ కమిటీ (పీపీపీఏసీ) ఈ మేరకు రైల్వే శాఖకు సూచించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మణుగూరు, రామగుండం మధ్య దూరం దాదాపు 90 కిలోమీటర్లు తగ్గుతుంది. న్యూఢిల్లీ-చెన్నై గ్రాండ్‌ ట్రంక్‌ లైన్‌లోని నాగపూర్‌-విజయవాడ సెక్షన్‌కు ఈ కొత్తలైన్‌ ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుందని రైల్వే ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పీపీపీ మోడల్‌కు సంబంధించిన రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ను రైల్వేబోర్డు రూపొందించాక టెండర్‌ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Updated Date - May 21 , 2026 | 03:22 AM