Share News

ప్రమాద బాధితులకు నగదురహిత వైద్యం

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:39 AM

రోడ్డు ప్రమాద బాధితుల్ని ఆదుకునేందుకు కేంద్రం తెచ్చిన ‘‘రహవీర్‌’’ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారుల్ని ఆదేశించారు.

ప్రమాద బాధితులకు నగదురహిత వైద్యం

  • కేంద్రం తెచ్చిన ‘రహవీర్‌’ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి

  • జూన్‌ 1నుంచి ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్ల ప్రారంభం: మంత్రి పొన్నం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాద బాధితుల్ని ఆదుకునేందుకు కేంద్రం తెచ్చిన ‘‘రహవీర్‌’’ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారుల్ని ఆదేశించారు. క్షతగాత్రులకు చికిత్స కోసం నగదు రహితంగా రూ.1.50 లక్షల వరకు అందించే ‘పీఎం రహవీర్‌’ పథకం ప్రయోజనాలను ప్రతిఒక్కరికీ చేరవేయాలన్నారు. మంగళవారం సచివాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన మంత్రి.. శాఖ పనితీరు, భవిష్యత్‌ ప్రణాళికపై దిఽశానిర్దేశం చేశారు. వాహనాల ఫిట్‌నెస్‌ సాంకేతికంగా పరీక్షించేందుకు.. రాష్ట్రంలో 37 ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ కేంద్రాలు మంజూరయ్యాయని తెలిపారు. జూన్‌ 1నాటికి తొలి కేంద్రం ప్రారంభించేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. రవాణా శాఖ కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణానికి వీలుగా కలెక్టర్లతో మాట్లాడి స్థలాలు సేకరించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ వాహనాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా మారి ఆ వాహనాల వినియోగాన్ని పెంచాలన్నారు. ఈ నెల 13నుంచి ప్రారంభం కానున్న ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రవాణా శాఖ స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌ రాజ్‌, ఆ శాఖ కమిషనర్‌ ఇలంబర్తి, జేటీసీలు చంద్రశేఖర్‌ గౌడ్‌, శివ లింగయ్య, రమేష్‌ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా, ‘రహవీర్‌’ కింద అందిస్తున్న రూ.25 వేల బహుమతిని.. రాష్ట్రంలో తొలిసారిగా నల్లగొండజిల్లా వాసి గణపతి వెంకన్న సొంతం చేసుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితుల సమాచారం అధికారులకు అందించి, వారిని రక్షించడంలో సహాయపడిన వెంకన్నకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ సచివాలయంలో రూ. 25వేల చెక్కును అందజేసి అభినందించారు.

Updated Date - Apr 08 , 2026 | 05:39 AM