Share News

రాహుల్‌ సింహం లాంటోడు

ABN , Publish Date - Jan 28 , 2026 | 04:11 AM

రిపబ్లిక్‌ డే సందర్భంగా ఢిల్లీలో జరిగిన పరేడ్‌లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీని అవమానించేందుకే మూడో వరుసలో కూర్చోబెట్టారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.

రాహుల్‌ సింహం లాంటోడు

  • ప్రధాని పదవి పుట్టిందే రాహుల్‌ గాంధీ ఇంట్లో

  • ప్రియాంక చిరుత పులి లాంటి నాయకురాలు

  • రిపబ్లిక్‌ డే పరేడ్‌లో అవమానించేందుకే..ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ను మూడో వరుసలో కూర్చోబెట్టారు

  • ఇది బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా చేసిన అవమానం

  • మోదీ సింహాసనంపైన కూర్చుంటేనే ప్రధాని అంటారు

  • రాహుల్‌ ఎక్కడా కూర్చున్నా అది సింహాసనమే

  • టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి

హైదరాబాద్‌, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రిపబ్లిక్‌ డే సందర్భంగా ఢిల్లీలో జరిగిన పరేడ్‌లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీని అవమానించేందుకే మూడో వరుసలో కూర్చోబెట్టారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా చేసిన అవమానమని మండిపడ్డారు. అయినా రాహుల్‌గాంధీ ఏమీ బాధపడరని.. ఎందుకంటే ప్రధాని పదవి పుట్టిందే ఆయన ఇంట్లోనని అన్నారు. రాహుల్‌గాంధీ సింహంలాంటి వారని, ప్రియాంకా గాంధీ చిరుతపులి లాంటి నాయకురాలని కొనియాడారు. గాంధీభవన్‌లో మంగళవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గతంలో నెహ్రూ, ఇందిర, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ మంచి సంప్రదాయాలను పాటించేవారని గుర్తుచేశారు. జాతీయ పతాకావిష్కరణ సమయంలో ప్రతిపక్ష నేతను ముందు వరుసలో కూర్చోబెట్టేవారని చెప్పారు. కానీ మోదీ ప్రభుత్వం ఆ సంప్రదాయాలను పక్కన పెట్టిందని విమర్శించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీలో జరిగిన వేడుకల్లో రాహుల్‌గాంధీని మూడో వరుసలో కూర్చోబెట్టి అవమానించిందని మండిపడ్డారు. ఐదో వరుసలో కూర్చోబెట్టినా రాహుల్‌గాంధీ ఏమీ ఫీల్‌ కారని అన్నారు. వాజ్‌పేయ్‌, అద్వానీ లాంటి వాళ్లను ఇందిర, రాజీవ్‌లు ముందు వరుసలో కూర్చోబెట్టి మర్యాద ఇచ్చారని గుర్తు చేశారు. ఆ సంప్రదాయాలను పక్కనబెట్టి ముందు తరాలకు మోదీ ఏం చెప్పదలచుకున్నారని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ కుటుంబం దేశానికి 47 ఏళ్ల పాటు న్యాయమైన, పేదలకు అండగా ఉండే పాలనను అందించిందని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ ఆలోచన, మాట, ప్రవర్తన అంతా సింహంలాగా ఉంటుందన్నారు. సింహానికి సింహాసనం అవసరం లేదని, అది ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనమని చెప్పారు. మోదీ సింహాసనం మీద కూర్చుంటేనే ఆయనను ప్రధాని అంటారని ఎద్దేవా చేశారు. ప్రియాంకా గాంధీ పార్లమెంటులో మోదీని చిరుతపులిలా వెంటాడారని అన్నారు. మంచి పాలన ఇవ్వాలని ప్రజలు బీజేపీకి అధికారం ఇచ్చారేకానీ.. రాహుల్‌గాంధీ కుటుంబాన్ని టార్గెట్‌ చేయాలని కాదన్నారు. ఇకనైనా రాహుల్‌ కుటుంబంపై రాజకీయంగా కుట్రలు చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ వాళ్లు దేవుడు, ధర్మం, పద్ధతులంటారు కానీ ఏవీ పాటించరని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ధర్మాలు, సంప్రదాయాలను పాటిస్తుందని తెలిపారు. బీజేపీ ఎంతసేపూ ప్రజల్లోకి చెడును ఎలా జొప్పించాలనే చూస్తుందని జగ్గారెడ్డి విమర్శించారు.

Updated Date - Jan 28 , 2026 | 04:11 AM