‘స్పీకర్ ప్రసాద్ జీ.. ఒకసారి ఢిల్లీకి రండి’
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:29 AM
స్పీకర్ ప్రసాద్ జీ.. మీరు అసెంబ్లీని చాలా బాగా నడిపిస్తున్నారు. ఒకసారి ఢిల్లీకి రండి’ అని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ ఆహ్వానించారు.
ప్రసాద్‌కుమార్‌కు రాహుల్ ఆహ్వానం
రాహుల్‌జీ.. మీరే నా రోల్ మోడల్: గడ్డం అనన్య
వికారాబాద్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘స్పీకర్ ప్రసాద్ జీ.. మీరు అసెంబ్లీని చాలా బాగా నడిపిస్తున్నారు. ఒకసారి ఢిల్లీకి రండి’ అని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ ఆహ్వానించారు. సోమవారం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు ప్రయాణమైన సందర్భంగా, హెలీప్యాడ్ వద్ద తనకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన స్పీకర్‌ను ఉద్దేశించి రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రసాద్‌కుమార్ స్పందిస్తూ, త్వరలోనే వస్తానని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ వారంలోనే ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ఎస్‌ఏపీ కళాశాల ప్రాంగణంలో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి.. స్పీకర్ ప్రసాద్ కుమార్తె, వికారాబాద్ మునిసిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్యను రాహుల్‌గాంధీకి పరిచయం చేశారు. ఈ సందర్భంగా అనన్య మాట్లాడుతూ.. ‘‘రాహుల్ జీ.. మీరే నా రోల్ మోడల్. యువత రాజకీయాల్లోకి రావాలన్న మీ పిలుపుతోనే నేను చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టాను’’అని పేర్కొన్నారు. తన తండ్రి స్పీకర్‌గా సేవలు అందిస్తున్నప్పటికీ, తన రాజకీయ ప్రస్థానానికి రాహుల్ గాంఽధీ ఆశయాలే మార్గదర్శకమని ఆమె తెలిపారు.
రాహుల్‌గాంధీకి ఘన స్వాగతం
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలీక్యాప్టర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కలిసి వచ్చిన రాహుల్‌గాంధీకి వికారాబాద్ ఎస్‌ఏపీ కళాశాల గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహే్‌షకుమార్‌గౌడ్, ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఠాగూర్, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, రాష్ట్ర మంత్రులు, సలహాదారులు, పార్టీ నేతలు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అంతకుముందు రాహుల్ గాంధీకి శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. సోమవారం ఉదయం 8.30గంటలకు వచ్చిన రాహుల్ వీవీఐపీ లాంజ్‌లో కొద్దిసేపు అల్పాహారం తీసుకుంటూ ముఖ్యమంత్రితో మాట్లాడారు. 8.50గంటలకు వికారాబాద్ బయలుదేరి వెళ్లారు.
ప్రైవేట్ బిల్లుకు రాహుల్ ఓకే
తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశ పెట్టడానికి రాహుల్‌గాంధీ అంగీకారం తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు, రాజకీయ వ్యవహారాల కమిటీల సభ్యులతో రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ నేత వి.హన్మంతరావు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కేంద్రం పెడింగ్ పెట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంటులో ఈ మేరకు ప్రయివేటు మెంబర్ బిల్లును పెట్టాలని రాహుల్‌ను ఆయన కోరగా అందుకు అంగీకరించారు.