Share News

శ్రీరామునిపై రాహుల్‌కున్నది భక్తి..!

ABN , Publish Date - Jul 02 , 2026 | 04:41 AM

శ్రీరామునిపై తమ అగ్రనేతరాహుల్‌గాంధీకి ఉన్నది భక్తి అయితే.. ఆ రాముడి పేరుతో ప్రధాని మోదీ చేస్తున్నది ఓటు రాజకీయమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.

శ్రీరామునిపై రాహుల్‌కున్నది భక్తి..!

  • మోదీ చేస్తున్నది ఓటు రాజకీయం

  • కేటీఆర్‌ ఖాళీగా ఉన్నా.. ఆయనకు మా సీఎం ఇప్పుడు టైమ్‌ ఇవ్వలేరు

  • కేసీఆర్‌ చేసిన అప్పులు కడుతూ..పథకాలు అమలుచేస్తూ బిజీగా ఉన్నడు

  • నేనూ మా పార్టీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌నే

  • కేటీఆర్‌తో చర్చకు నేను సిద్ధం

  • నెహ్రూ రాముడిని ఆదర్శంగా తీసుకోగా..మోదీ రాజకీయంగా బతుకుతున్నడు

  • అయోధ్యలో దొంగతనం చిన్నఅంశమా?

  • కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

హైదరాబాద్‌, జూలై 1(ఆంధ్రజ్యోతి): శ్రీరామునిపై తమ అగ్రనేతరాహుల్‌గాంధీకి ఉన్నది భక్తి అయితే.. ఆ రాముడి పేరుతో ప్రధాని మోదీ చేస్తున్నది ఓటు రాజకీయమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. భారత తొలి ప్రధాని నెహ్రూ.. శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని పరిపాలించారని, ప్రధాని మోదీ మాత్రం రాముడి పేరుతో రాజకీయంగా బతుకుతున్నారని విమర్శించారు. రాహుల్‌గాంధీ, ఆయన కుటుంబానికి.. మోదీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఇది అని తెలిపారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అయోధ్య రామమందిరం కోసం భక్తులు ఇచ్చిన విరాళాలను దోచుకుంటే దానిపై ప్రధాని మోదీ, అమిత్‌షాలుగానీ, బీజేపీ నాయకులుగానీ ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్నది కూడా బీజేపీనే అని గుర్తు చేశారు. ‘ప్రస్తుతం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందంటే.. అది శ్రీరాముని వల్లనే. ఆయన పేరుతో అధికారంలోకి వచ్చిన మోదీ.. ఈ ఘటనపై ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదు? అంటే శ్రీరాముడిని ఆయన ఓటు బ్యాంకుగానే చూస్తున్నారా? కేంద్రంలో, యూపీలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. భద్రత వారి చేతిలోనే ఉంది. అయోధ్య ట్రస్టూ మోదీ, అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పరిధిలోనే ఉంది. ఇకనైనా శ్రీరాముని విరాళాల దోపిడీపై ప్రధాని మోదీ నోరు విప్పాలి’ అని అన్నారు. ఈ ఘటనపై ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయోధ్య రాముడి గుడిలో కానుకల చోరీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చిన్న విషయంగా కొట్టి పారేస్తున్నారని, ఆయనకు అది చిన్న విషయంగా కనిపిస్తోందా? అని ప్రశ్నించారు. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండి ఉంటే.. బీజేపీ వాళ్లు దేశమంతా ఎంత రాద్ధాంతం చేసి ఉండేవాళ్లని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కులాలు, మతాలను కలుపుతుందని, బీజేపీ కులమతాల పేరుతో ప్రజల్ని విడదీస్తుందని విమర్శించారు. బీజేపీ నేతల్లో ప్రతిరోజూ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్లి దీపం పెట్టేవారు ఎవరైనా ఉన్నారా? అని నిలదీశారు. మోదీ, అమిత్‌షా, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌.. ఎన్నికలకు రెండు నెలల ముందు భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్తారని ఎద్దేవా చేశారు.


కేటీఆర్‌తో చర్చకు నేను సిద్ధం

రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు చేస్తూ.. కేసీఆర్‌ చేసిన అప్పులు, వాటికి మిత్తీలు కడుతూ.. పథకాలకు పైసలు జమచేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నారని జగ్గారెడ్డి అన్నారు. చర్చలు పెట్టడానికి కేటీఆర్‌కు ఇప్పుడు ఆయన టైమ్‌ ఇవ్వలేరని స్పష్టం చేశారు. పదేళ్లలో రాష్ట్రాన్ని అథోగతి పాలు చేసిన బీఆర్‌ఎస్‌ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌కు కేటీఆర్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడైతే.. రాష్ట్ర కాంగ్రె్‌సకు తాను కార్యనిర్వాహక అధ్యక్షుడినని, కేటీఆర్‌ సవాల్‌ను స్వీకరించి చర్చించడానికి తాను సిద్ధమని తెలిపారు.

Updated Date - Jul 02 , 2026 | 04:41 AM