Share News

తప్పు చేయను! తలొగ్గను!

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:31 AM

తప్పులు చేసిన వాడే భయానికి లొంగిపోతాడని, ప్రధాని మోదీ అనేక తప్పులు.. చీకటి ఒప్పందాలు చేసుకున్నాడు కాబట్టే ఆ భయానికి అగ్రరాజ్యం అమెరికాకు లొంగిపోయారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ....

తప్పు చేయను! తలొగ్గను!

  • మోదీ తప్పులు చేశాడు కాబట్టే అమెరికాకు లొంగిపోయాడు

  • విద్వేషంతో మళ్లీ గెలవాలని బీజేపీ చూస్తోంది

  • డీసీసీ అధ్యక్షుల సమావేశంలో రాహుల్‌

హైదరాబాద్‌, మార్చి 2(ఆంధ్రజ్యోతి): తప్పులు చేసిన వాడే భయానికి లొంగిపోతాడని, ప్రధాని మోదీ అనేక తప్పులు.. చీకటి ఒప్పందాలు చేసుకున్నాడు కాబట్టే ఆ భయానికి అగ్రరాజ్యం అమెరికాకు లొంగిపోయారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. మోదీ-అదానీల చీకటి ఒప్పందాలకు సంబంధించిన వివరాలు అన్నీ అమెరికా వద్ద ఉన్నాయని చెప్పారు. అమెరికాకు మోదీ లొంగిపోయారు కాబట్టే.. తక్కువ ధరకు చమురు అమ్మడానికి రష్యా ముందుకు వచ్చినా తీసుకోవట్లేదన్నారు. తాను ఇంతవరకు ఎలాంటి తప్పూ చేయలేదని, ఎవరికీ భయపడేదీ, లొంగిపోయేదీ లేదన్నారు. వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌లో జరిగిన ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో బీజేపీ చేస్తున్న తప్పులు, వాటి పట్ల కాంగ్రెస్‌ వైఖరిని పార్టీ నేతలకు వివరించారు. హింస, మతోన్మాదం బీజేపీ విధానమైతే అహింస, గాంఽధేయవాదం కాంగ్రెస్‌ విధానమని చెప్పారు. బీజేపీ ఎప్పుడూ ధనికులు, ఉన్నవారి పక్షాన నిలబడుతుందని ఆరోపించారు. అదానీ, అంబానీలకు అండగా నిలబడిన మోదీ వారికి రూ.లక్షల కోట్లు దోచి పెట్టారని అన్నారు. ఆ డబ్బుతోనే వివిధ రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను కూలగొడుతున్నారని ఆరోపించారు. దేశం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేసిన చట్టాలు, నాయకులు చేసిన త్యాగాలను రాహుల్‌గాంధీ వివరించారు. డీసీసీ అధ్యక్షులూ పార్టీ సైద్ధాంతికతను అలవరుచుకుని పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిభను నిరూపించుకుంటే డీసీసీ అధ్యక్షుల ఇళ్ల వద్దకే ఎమ్మెల్యే టిక్కెట్లు వస్తాయని హామీఇచ్చారు. ప్రజలకు పార్టీ, పార్టీకి ప్రజలూ బలం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలపైన పోరాటాలు చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ గుర్తు అభయముద్ర అని, ప్రపంచంలోని అన్ని మతాల చిహ్నం కూడా అభయముద్రేనని ప్రస్తావించారు.


పార్టీలో మహిళలను గౌరవించాలని, వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. డీసీసీ అధ్యక్షులు పార్టీ బలోపేతం, ప్రజల కోసం పని చేయాలని, వారి భవిష్యత్తును తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. బాగా పనిచేస్తే ఏ స్థాయికైనా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పారు. డీసీసీ అధ్యక్ష పదవిని ఒక బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. ప్రజల మధ్య ద్వేషం, విభేధాలు సృష్టించి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోందని, అప్రమత్తంగా ఉండి ఆ పార్టీ ఆగడాలను అడ్డుకుని దేశాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. ప్రతి నెలా30 గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మమేకమవుతామని, డీసీసీ కార్యాలయాల్లో ఫిర్యాదుల విభాగాలను ఏర్పాటు చేస్తామని, బూత్‌ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రెండు నెలల్లో కమిటీల ఏర్పాటును పూర్తి చేస్తామని డీసీసీ అధ్యక్షులు రాహుల్‌కు చెప్పారు. టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ, పంచాయతీ, మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని, డీసీసీల నియామకంలోనూ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామని ప్రస్తావించారు. కాగా, ఏపీలో పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి ఏంచేయాలంటూ రాహుల్‌గాంధీ ఏపీసీసీ పీఏసీ సభ్యులను అడిగారు. మాజీ మంత్రి కమలమ్మ మాట్లాడుతూ పార్టీ కోసం మొదటి నుంచీ కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తల్ని గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కాగా, భోజన విరామానికి ముందు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులు, వారి కుటుంబాలతో రాహుల్‌గాంధీ ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమం తర్వాత భోజన విరామం.. అనంతరం డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. నాయకులు సాదాసీదాగా ఉంటేనే రాజకీయాల్లో నిటారుగా నిలబడతారన్న రాహుల్‌గాంధీ డీసీసీ అధ్యక్షులను నిటారుగా నిల్చోపెట్టి ఇలా ఉంటారని చూపెట్టారు.

Updated Date - Mar 03 , 2026 | 03:31 AM