గాంధీభవన్‌లో ఘనంగా రాహుల్ జన్మదిన వేడుక
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:22 AM
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు గాంధీభవన్‌లో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఆయన జన్మదినాన్ని పుర్కరించుకుని మెగా జాబ్ మేళా...
కేక్ కట్ చేసిన టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
మెగా జాబ్ మేళా నిర్వహణ
రక్తదానం చేసిన మంత్రి సీతక్క
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి) : ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు గాంధీభవన్‌లో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఆయన జన్మదినాన్ని పుర్కరించుకుని మెగా జాబ్ మేళా, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ జాబ్ మేళాను, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్.. రాహుల్ జన్మదినం సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో భారీ కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా జాబ్ మేళాలో పాల్గొన్న యువతను ఉద్దేశించి మాట్లాడుతూ... దేశ యువతకు ఉపాధి అవకాశాల కల్పనే రాహుల్‌గాంధీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన నిరంతరం పోరాటం చేస్తున్నారన్నారు. కాగా.. రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన మెగా జాబ్ మేళాలో వందకు పైగా కంపెనీలు పాల్గొన్నాయి. ఈ మేళాలో పాల్గొన్న నిరుద్యోగుల్లో అనేక మందికి ఐటీ, నాన్ ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ తదితర రంగాల్లో ఆయా కంపెనీలు ఉపాధి అవకాశాలు కల్పించాయని నిర్వాహకులు తెలిపారు. మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి మహే్‌షకుమార్‌గౌడ్, మంత్రి అజారుద్దీన్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు యర్రబెల్లి స్వర్ణ, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాగా.. రాహుల్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తమ రక్తాన్ని దానం చేశారు. ఈ శిబిరాన్ని సందర్శించిన మంత్రి సీతక్క తన రక్తాన్ని దానం చేశారు. శిబిరాన్ని ప్రారంభించిన మహే్‌షగౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... రక్తదానం మహాదానమని, యువత సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి రక్తదాన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ సలహాదారు వి. హన్మంతరావు చేతుల మీదుగా స్కూల్ పిల్లలకు పుస్తకాల పంపిణీ జరిగింది. టీపీసీసీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాహుల్ జన్మదిన వేడుక జరిగింది. సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ కేక్ కట్ చేశారు.
రాహుల్ ప్రధాని కావాలన్నది జెన్ జీల ఆకాంక్ష : మంత్రి పొన్నం
దేశంలోని జెన్ జీల ఆకాంక్ష మేరకు రాహుల్‌గాంధీ దేశానికి ప్రధాని కావడం ఖాయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాహుల్ జన్మదినం సందర్భంగా మంత్రుల క్వార్టర్లలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
స్ఫూర్తినిచ్చే నేత.. రాహుల్: సీఎం
లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ స్ఫూర్తినిచ్చే నాయకుడు రాహుల్‌గాంధీ అంటూ ఈ సందర్భంగా కొనియాడారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమంపై ఆయనకున్న అచంచలమైన నిబద్ధత ఎందరికో స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. ఈ మేరకు శుక్రవారంనాడు ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.