హిట్ అండ్ రన్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి షాక్!
ABN , Publish Date - May 02 , 2026 | 05:53 AM
జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహీల్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు.
దుబాయ్ వెళ్లేందుకు నిరాకరించిన పోలీసులు
బంజారాహిల్స్, మే 1 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహీల్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం కుదరదని స్పష్టం చేస్తూ, అతడి దుబాయ్ ప్రయాణాన్ని అడ్డుకున్నారు. 2022 మార్చి 17న జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 45 వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో రాహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కొంతకాలంగా దుబాయ్‌లో తలదాచుకున్న రాహీల్, హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. ఏప్రిల్ 30న తిరిగి దుబాయ్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రాహీల్‌ను వారించారు. హైకోర్టు నిబంధనల ప్రకారం విచారణ కొనసాగుతున్న సమయంలో రాష్ట్రం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లాలంటే కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలని సూచించారు.