Share News

నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటే ఉద్యోగాలు

ABN , Publish Date - May 06 , 2026 | 07:27 AM

నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకుంటే అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు, రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ స్పష్టం చేశారు.

నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటే ఉద్యోగాలు

  • సులభతర వాణిజ్య విధానంపై ఆధారపడే పెట్టుబడులు .. ఏఐని సరైన పద్ధతిలో వినియోగిస్తే అందరికీ మేలు

  • రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ సూచనలు

  • ఉన్నత, సాంకేతిక విద్యతోపాటు వైద్య విద్య సిలబ్‌సలో ఏఐ..

  • ఇందుకోసం కమిటీ వేస్తాం సూచనలివ్వండి.. సీఎం రేవంత్‌ వినతి

హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకుంటే అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు, రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వాలు అమలు చేసే సులభతర వాణిజ్య విధానాలపై ఆధారపడే రాష్ట్రాలకు పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. మానవ వనరుల అభివృద్ధి కోసం పోషకాహార లోపం సమస్యను తగ్గించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి రఘురామ్‌ రాజన్‌తోపాటు డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికపై నిర్వహించిన ఈ సమావేశంలో యువతలో నైపుణ్యాభివృద్ధి, పిల్లలకు పోషకాహార లోపం, మానవ వనరుల అభివృద్ధి, ప్రభుత్వ సులభతర వాణిజ్య విధానం, విద్య, వైద్య రంగాల్లో ఏఐ వినియోగంపై రఘురామ్‌ రాజన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వాల సులభతర వాణిజ్య విధానం మీద ఆధారపడే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని రఘురామ్‌ రాజన్‌ ఈ సందర్భంగా అన్నారు. అయితే స్టార్ట్‌పలను ఎక్కువ ప్రోత్సహిస్తే మరింత ఉపయోగం ఉంటుందని సూచించారు.


పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యతో పాటు వైద్య విద్య సిలబ్‌సలో ఏఐ ఉపయోగంపై కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా రఘురామ్‌ రాజన్‌ను కోరారు. మధ్య స్థాయి ఉద్యోగాల కల్పన కోసం స్కిల్స్‌ యూనివర్సిటీ, ఏటీసీలను అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం ఆయనకు వివరించారు. ఇందుకు స్పందించిన రఘురామ్‌ రాజన్‌.. సరైన పద్ధతిలో ఏఐని వినియోగిస్తే అందరికీ మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. తమిళనాడు తరహాలో పారిశ్రామిక విధానం ఉంటే మరిన్ని పెట్టుబడులను ఆకర్షించవచ్చని సూచించారు. డేటా సెంటర్ల కోసం పెద్ద ఎత్తున విద్యుత్తు, నీటి ఉపయోగం ఉంటుందని అభిప్రాయపడ్డారు. మూడు నాలుగు నెలల్లో హైదరాబాద్‌ వస్తానని వెల్లడించారరు. ఇక, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల కోసం కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డు ఏర్పాటుతో పాటు రేడియల్‌ రోడ్లు, పరిశ్రమల కోసం ప్రత్యేక క్లస్టర్లు తీసుకురాబోతున్నామని వివరించారు. రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి అభివృద్ధిపై దృష్టి సారించామని, క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ మోడల్‌లో ముందుకు వెళుతున్నట్లు ఆయన వివరించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ఐటీఐలను ఏటీసీలుగా మార్చామని వివరించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 24 గంటలు శ్రమిస్తున్నారని, తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన రఘురామ్‌ రాజన్‌ను కోరారు. మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. సులభతర వాణిజ్యానికి అనుగుణంగా తెలంగాణలో పరిస్థితులు ఉన్నాయని, ఫార్మా, ఐటీ, డేటా సెంటర్ల కోసం కావాల్సిన మంచి వాతావరణం, వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు.

Updated Date - May 06 , 2026 | 07:28 AM