Share News

Medak MP Raghunandan Rao: కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరు?

ABN , Publish Date - Jan 07 , 2026 | 03:45 AM

తెలంగాణలో ఏం సాధించారని పార్టీ పేరు మార్చుకుని దేశమంతా తిరిగారని శాసనమండలి వేదికగా ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారని....

Medak MP Raghunandan Rao: కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరు?

  • యువరాజా.. బావ చెబుతారా?

  • పాలమూరుకు రేవంత్‌ ఏం చేశారో చెప్పాలి

  • మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు

వర్గల్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఏం సాధించారని పార్టీ పేరు మార్చుకుని దేశమంతా తిరిగారని శాసనమండలి వేదికగా ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారని మెదక్‌ ఎంపీ రఘనందన్‌రావు అన్నారు. యువరాజు (కేటీఆర్‌) చెప్తాడా? బావ (హరీశ్‌రావు) చెప్తాడా? లేక ఫామ్‌ హౌస్‌లో ఉన్న పెద్దాయన (కేసీఆర్‌) చెప్తాడా అని ఆయన ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్‌ కేంద్రంలో మంగళవారం జవహర్‌ నవోదయ విద్యాలయంలో నిర్వహించిన 27వ జాతీయ స్థాయి యువ పార్లమెంట్‌ పోటీల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో సొంత రైతులు చనిపోతే పట్టించుకోని కేసీఆర్‌ ప్రభుత్వం.. పంజాబ్‌, కర్ణాటక, మహారాష్ట్ర రైతులకు ఇక్కడి నిధులు ఎలా పంపిణీ చేసిందని నిలదీశారు. ఇప్పుడు ఇదే విషయాన్ని స్వయంగా కేసీఆర్‌ బిడ్డే అడుగుతున్నారని, దీనికి ఆ పార్టీ నేతలు ఏం సమాధానం చెబుతారని ఆయన ఎద్దేవా చేశారు. శాసనసభలో నేడు నాయకులు వాడుతున్న భాషపై రఘునందన్‌ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి, ప్రతిపక్ష నేతలు తమ భాషను నియంత్రించుకోవాలని ఆయన హితవు పలికారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో పదేళ్లలో కేసీఆర్‌ చేయనిది, రెండేళ్లలో రేవంత్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పనిచేసిన సర్పంచ్‌లకు ఇవ్వాల్సిన బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదని, ‘మన ఊరు- మన బడి’ నిధులను కూడా ఆపేశారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి నిధుల కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని, కేంద్రం ఇచ్చే విధంగా గ్రామపంచాయతీలకు నిధులను విడుదల చేయాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ వార్డుల విభజన, ముంపు గ్రామాల విలీనం విషయంలో ప్రభుత్వానికి కనీస అవగాహన లేదని రఘునందన్‌రావు విమర్శించారు.

Updated Date - Jan 07 , 2026 | 03:45 AM