Share News

కొత్వాల్‌గూడ మైనింగ్‌ మాది కాదు

ABN , Publish Date - Mar 31 , 2026 | 06:05 AM

కొత్వాల్‌గూడ మైనింగ్‌ కార్యకలాపాలతో రాఘవ కనస్ట్రక్షన్‌ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ డైరెక్టర్‌ నిరంజన్‌రెడ్డి అన్నారు.

కొత్వాల్‌గూడ మైనింగ్‌ మాది కాదు

  • రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధం లేదు

  • తిరుమల మెటల్‌ ఇండస్ర్టీ మా క్రషర్‌ను లీజుకు తీసుకుంది

  • తప్పుదారి పట్టించేలా మైనింగ్‌ అధికారుల నోటీసులు

  • హరీశ్‌ ఆరోపణల్లో వాస్తవం లేదు

  • రాఘవ కంపెనీతో పొంగులేటి కుటుంబానికి సంబంధం లేదు

  • రాఘవ సంస్థ డైరెక్టర్‌ నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 30 (ఆంధ్ర జ్యోతి): కొత్వాల్‌గూడ మైనింగ్‌ కార్యకలాపాలతో రాఘవ కనస్ట్రక్షన్‌ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ డైరెక్టర్‌ నిరంజన్‌రెడ్డి అన్నారు. రాఘవ కనస్ట్రక్షన్స్‌తో మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డికి , ఆయన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాఘవ సంస్థకు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి ఎండీగా, నిరంజన్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారని చెప్పారు. ఈ మేరకు సోమవారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా మైనింగ్‌ ఏడీ జారీ చేసిన నోటీసులు తమకు అందలేదన్నారు. కాలుష్య నియంత్రణ మండలికి మైనింగ్‌ అధికారులు లేఖ రాశారని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆరోపించారని, అయితే అక్కడ జరిగే మైనింగ్‌, క్రషింగ్‌తో రాఘవ సంస్థకు ఎలాంటి సంబధం లేదని పేర్కొన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా, సంబంధిత వ్యక్తులకు నోటీసులు సరైన రీతిలో అందించకుండా మైనింగ్‌ ఏడీ తీసుకున్న చర్యలు అసంబద్ధంగా ఉన్నాయన్నారు. హెచ్‌ఆర్‌డీసీఎల్‌ నుంచి రాయల్టీ చెల్లింపులకు సంబంధించిన వివరాలు అందిన తరువాత కూడా ఈ తరహా చర్యలు సరైనవి కావన్నారు. మైనింగ్‌ అధికారుల చర్యలు తమ ప్రతిష్ఠకు తీవ్ర నష్టం కలిగించాయని తెలిపారు. హరీశ్‌రావు ఆరోపణల్లో నిజం లేదని, మైనింగ్‌ అధికారుల నుంచి సేకరించిన నోటీసులను శాసన సభలో ప్రస్తావించి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాలుష్య నియంత్రణ మండలి, మైనింగ్‌, విద్యుత్తు శాఖ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలిపారని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.


కొత్వాల్‌గూడలో మాకు క్రషర్‌ లేదు

రాఘవ కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడలో ఎలాంటి క్రషర్‌ లేదని ఆ సంస్థ డైరెక్టర్‌ నిరంజన్‌రెడ్డి తెలిపారు. తిరుమల మెటల్‌ ఇండస్ర్టీ సంస్థ.. రాఘవ సంస్థకు చెందిన క్రషర్‌ను లీజుకు తీసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు. ఇందుకు సంబంధించి 2024 నవంబరు 12న ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్తు కనెక్షన్‌ (యుఎస్సీ నంబరు 115228152) తిరుమల మెటల్‌ ఇండస్ర్టీ యజమాని మల్లిఖార్జునకుమార్‌ పేరుతో ఉందన్నారు. రహదారుల పనులకు అవసరమైన కంకరను రాఘవ సంస్థ ఒప్పందం ప్రకారం తిరుమల మెటల్‌ ఇండస్ర్టీ నుంచి కొనుగోలు చేస్తోందని చెప్పారు. సీనరేజ్‌ చార్జీలను చెల్లించిన విషయాన్ని హెచ్‌ఆర్‌డీసీఎల్‌ 2025జనవరి 8న లేఖ ద్వారా మైనింగ్‌ అధికారులకు తెలిపారని, ఎటువంటి ఆటంకం లేకుండా కంకర రవాణాకు అనుమంతించాలని కోరారని వెల్లడించారు. రాఘవ సంస్థ తరలించిన మెటీరియల్‌ను అంచనా వేసిన హెచ్‌ఆర్‌డీసీఎల్‌ అధికారులు రూ.2,75,23,271 సీనరీజ్‌ చార్జీ చెల్లించాలని కోరితే ఆ మొత్తం చెల్లించామని గుర్తు చేశారు. క్రషర్‌ వద్ద ఉండే మెటీరియల్‌కు సంబంధించిన సీనరేజ్‌ చెల్లింపు బాధ్యత రాఘవ సంస్థకు లేదన్నారు. రాఘవ సంస్థ తరలించిన మెటీరియల్‌ వరకు మాత్రమే సంబంధం ఉంటుందన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 06:05 AM