Share News

ఓటుకు నోటు ద్వారా రేవంత్‌ ఓటు చోరీ

ABN , Publish Date - Jun 16 , 2026 | 05:14 AM

ఓటుకు నోటు ద్వారా మీరు ఓటు చోరీ చేయలేదా?’’ అని సీఎం రేవంత్‌ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు ప్రశ్నించారు.

ఓటుకు నోటు ద్వారా రేవంత్‌ ఓటు చోరీ

  • సోనియాకు ఓటు హక్కు, నెహ్రూకు ప్రధాని పదవి, ఇందిర ప్రధానిగా కొనసాగడం సీటు చోరీ కాదా!?

  • బీజేపీ రాష్ట్ర చీఫ్‌ రాంచందర్‌ రావు

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ‘‘ఓటుకు నోటు ద్వారా మీరు ఓటు చోరీ చేయలేదా?’’ అని సీఎం రేవంత్‌ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు ప్రశ్నించారు. అబద్ధాలకు తల్లి కాంగ్రెస్‌ అయితే, తండ్రి రేవంత్‌ అని ఆరోపించారు. సీఎం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ‘‘ఓటు చోరీ.. సీటు చోరీ.. అంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకులకు ‘మెదడు చోరీ ’ అయింది. భారత పౌరసత్వం లేకపోయినా నాడు సోనియాకు ఓటు హక్కు కల్పించడం ఓటు చోరీ కాదా? కాంగ్రెస్‌ అంతర్గత ఎన్నికలో సర్దార్‌ పటేల్‌కు మెజారిటీ ఓట్లు వచ్చినా.. ఆయనను కాదని, కేవలం రెండు ఓట్లు మాత్రమే వచ్చిన నెహ్రూను ప్రధానిగా చేయడం సీటు చోరీ కాదా? అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సైతం పట్టించుకోకుండా ప్రధానిగా ఇందిర కొనసాగడం సీటు చోరీ కాదా?’’ అని నిలదీశారు. హైదరాబాద్‌లో అక్రమంగా నివాసముంటున్న 10 వేల మంది పాకిస్థానీలకు ఓటు హక్కు కల్పించాలా? అని కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలను ప్రశ్నించారు. ‘సర్‌’ తర్వాత తెలంగాణలో దొంగ ఓట్లు, రోహింగ్యాల ఓట్లు ఉండబోవని తేల్చిచెప్పారు. ‘‘‘సర్‌’ అనేది ప్రధాని మోదీనో, కేంద్ర ప్రభుత్వమో సొంతంగా తెచ్చిన కార్యక్రమం కాదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికల సంఘం నిర్వహించే నిరంతర ప్రక్రియ ఇది. 1951 నుంచి2002 వరకు కాంగ్రెస్‌ హయాంలోనూ ‘సర్‌’ జరిగింది. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు వస్తున్నాయి?’’ అని ప్రశ్నించారు. ‘సర్‌’ వల్లే బెంగాల్‌లో బీజేపీ గెలిచిందని కొందరు కాంగ్రెస్‌ నేతలు విమర్శించడం హాస్యాస్పదమని, కేరళంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ గెలిచినప్పుడు ‘సర్‌’ గుర్తుకు రాలేదా!? అని నిలదీశారు. బిహార్‌, బెంగాల్‌తోపాటు హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో కూడా రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, పాకిస్థానీ అక్రమ చొరబాటుదారులు కొన్ని పార్టీల మద్దతుతో దొంగ ఆధార్‌, రేషన్‌ కార్డులు సంపాదించి ఓటర్లుగా నమోదవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓల్డ్‌ సిటీలో ఒక్కో ఇంట్లో 200 దొంగ ఓట్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 05:14 AM