రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలు నెలాఖరులోపు విడుదల చేయాలి
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:39 AM
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 10వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు లోపు విడుదల చేయకపోతే.. జూలైలో ఆమరణ నిరాహార దీక్ష ...
లేనిపక్షంలో జూలైలో ఆమరణ నిరాహార దీక్ష:ఆర్ కృష్ణయ్య
బర్కత్‌పుర, జూన్ 25(ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 10వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు లోపు విడుదల చేయకపోతే.. జూలైలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు తరగతులను బహిష్కరిస్తారని, జిల్లా కలెక్టరేట్లు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. అప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి మొండి వైఖరి విడనాడకపోతే 5 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్‌ను దిగ్బంధం చేస్తామన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... 14లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వం రూ.10వేల కోట్లు అప్పు తెస్తే చెల్లించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. విద్యార్థులపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించే జీవో 8, 9లను వెంటనే రద్దు చేయాలని, పాతపద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు..