బీసీ రిజర్వేషన్ల చట్టం తర్వాతే పరిషత్ ఎన్నికలు నిర్వహించాలి
ABN , Publish Date - Feb 16 , 2026 | 02:11 AM
స్థానిక సంస్థల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు చట్టబద్ధం చేసిన తర్వాతే ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
మేయర్, చైర్మన్ పదవుల్లో బీసీలకు 50ు ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య
బర్కత్‌పుర, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు చట్టబద్ధం చేసిన తర్వాతే ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో అన్యాయం చేసినా.. బీసీలు 57ు స్థానాలను దక్కించుకుని సత్తా చాటారన్నారు. బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు నీల వెంకటేశ్, బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జీ.అనంతయ్య ఆధ్వర్యంలో ఆదివారం 14 బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు వెలువడ్డాకే పరిషత్ ఎన్నికలకెళ్లాలని, లేకపోతే రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మారుస్తామని హెచ్చరించారు. మునిసిపాలిటీ చైర్మన్/చైర్‌పర్సన్, నగర పాలక సంస్థ మేయర్ పదవుల్లో బీసీలకు 50ు కేటాయించాలన్నారు. ఇప్పటికీ 64 సార్లు ఢిల్లీకెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి.. బీసీ రిజర్వేషన్లపై ఒక్కసారి కూడా ప్రధాని వద్దకు అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లలేదని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు.