kumaram bheem asifabad- కోటా..కోత
ABN , Publish Date - Jun 19 , 2026 | 11:05 PM
పొగ రహిత గ్రామాలు, పేద మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ఉద్దేశం క్రమేణా అటకెక్కుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఽధరల సాకుతో చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ సిలిండర్ల సంఖ్యపై కోత విధిస్తోంది. దీంతో ఉజ్వల పథకంలో లబ్ధి పొందుతున్న పేద, మధ్య తరగతి వర్గాల కుటుంబాలపై గ్యాస్ బండ భారం పెరుగుతోంది.
బెజ్జూరు, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): పొగ రహిత గ్రామాలు, పేద మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ఉద్దేశం క్రమేణా అటకెక్కుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఽధరల సాకుతో చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ సిలిండర్ల సంఖ్యపై కోత విధిస్తోంది. దీంతో ఉజ్వల పథకంలో లబ్ధి పొందుతున్న పేద, మధ్య తరగతి వర్గాల కుటుంబాలపై గ్యాస్ బండ భారం పెరుగుతోంది. ఇప్పటి వరకు ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ వినియోగిస్తున్న వారికి ప్రభుత్వం ఏటా 9 సిలిండర్లు సరఫరా చేస్తోంది. ఇక నుంచి నాలుగు సిలిండర్లు మాత్రమే సరఫరా చేయనుంది. దీంతో జిల్లాలో 26,481మంది వినియోగదారులపై ప్రభావం పడనుంది. జిల్లాలో మొత్తం 12గ్యాస్ ఏజెన్సీలు, 1.90లక్షల గ్యాస్ కనెక్షన్లు, 10,591దీపం కనెక్షన్లు, 26,481ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి.
- సగటున ఆరు వినియోగం..
పేద, మధ్యతరగతి కుటుంబాలు సగటున ఏటా ఆరు గ్యాస్ సిలిండర్ల వరకు వినియోగిస్తారు. ఇప్పటి వరకు ఏటా తొమ్మిది సిలిండర్లు సరఫరా చేస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. కానీ ప్రస్తుతం నాలుగు సిలిండర్లకు తగ్గించడంతో వినియోగదారులపై భారం పడనుంది. నాలుగు సిలిండర్లు పూర్తయిన తర్వాత ఐదో సిలిండర్ అవసరమైతే సాదారణ సిలిండర్‌ను పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది తమపై భారం పడనున్నందున ఏడాదికి కనీసం ఆరు సిలిండర్లు అయినా సరఫరా చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. గతంలో పేద కుటుంబాలకు కేంద్రం ఉజ్వల పథకం కింద గ్యాస్ స్టవ్‌తో పాటు సిలిండర్, రెగ్యులేటర్, పైపులను ఉచితంగా అందించింది. తొలుత ఏటా 12సిలిండర్లు అందిస్తూ ఒక్కో సిలిండర్‌పై రూ.300రాయితీ సైతం అందించేది. ఈ క్రమంలో గతేడాది నుంచి ఏటా అందించే గ్యాస్ సిలిండర్ల సంఖ్యను 12నుంచి 9కి కుదించింది. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో సిలిండర్ల సంఖ్యను నాలుగుకు పరిమితం చేసింది. దీంతో ఉజ్వల పథకం వినియోగదారులకు భారం కలగనుంది.